అన్నాడీఎంకేను  కైవసం చేసుకొనే లక్ష్యంలో శశికళ !

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ నాలుగేళ్ల జైలు జీవితం అనంతరం భారీ ఊరేగింపుగా ఆమె నేడు చెన్నైకి చేరుకున్న తీరు గమనిస్తే అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను హస్తగతం చేసుకొనే ఎత్తుగడతో ఆమె ఉన్నట్లు స్పష్టం అవుతుంది.  ఆదాయానికి మించిన ఈ రోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి చెన్నైకి వచ్చారు. తన కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండాతో తమిళనాడులో అడుగుపెట్టారు. 

ఆమె జైలుకు వెళ్లిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరించి పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు అధికారం చేపట్టారు.  ఆమె పార్టీ జెండాతో తమిళనాడులో అడుగుపెట్టడం వారిని కలవర పెడుతోంది. శశికళ కాన్వాయ్‌కి అభిమానులు దారిపోడవునా స్వాగతం పలికారు.జయలలిత ఎక్కువగా ధరించే ఆకుపచ్చని చీరలో కారులో నుండే తన మద్దతుదారులను పలకరించారు. కరోనా నిబంధనల దృష్ట్యా సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశించారు.

జనవరి 31న బెంగుళూరులోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినా సందర్భంగా ఆమె కారుకు అన్నాడీఎంకే జెండా కనిపించడంతో పార్టీ సభ్యులు కానీ వారు తమ జెండాను ఉపయోగించకుండా కట్టడి చేయాలనీ కోరుతూ అధికార పక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదులను ఆమె లెక్కచేయడంలేదని నేడు స్పష్టమైనది. 

అన్నాడీఎంకే కార్యాలయంలోకి శశికళ ప్రవేశిస్తే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ హెచ్చరికలు చేశారు. అంతే కాకుండా శశికళ ఆగమనం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితుల్ని సృష్టించవచ్చని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. 

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాలుగా వ్యవహరించారని, ఆమె సహాయకురాలిగా ఉన్న శశికళను పార్టీలో చేర్చుకోలేదని, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని మళ్లీ పార్టీలోకి చేర్చుకొనే అవకాశం లేదని పార్టీ నేతలు అంటున్నారు. 

అంతే కాకుండా ఆమె డీఎంకే-బి టీమ్‌ అంటూ ఆరోపణు కూడా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడుకు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం ఎలా మారనుందో చూడాలి. ఆమె అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గృహాన్ని సందర్శిస్తారని ఆమెతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఆమె మేనల్లుడు, ఎమ్యెల్యే టిటివి దినకరన్ చెప్పారు.

అన్నాడీఎంకే కు చెందిన అనేకమంది ఆమెకు స్వాగతం చెప్పడానికి వచ్చారని పేర్కొంటూ ఆమె ప్రయాణిస్తున్న కారు సహితం ఆ పార్టీకి చెందిన ఓకే ప్రముఖుడిదని తెలిపారు. ఆమె కారు దారిలో చెడిపోవడంతో ఆ కారులో వస్తున్నారని పేర్కొన్నారు. ఆమెను పార్టీ నుండి బహిష్కరించినా ఇంకా ఆ విషయం కోర్ట్ పరిశీలనలో ఉన్నందున ఆమెయే పార్టీ ప్రధాన కార్యదర్శి అంటూ దినకరన్ స్పష్టం చేయడం గమనార్హం.