తపోవన్ ప్రాంత నందాదేవి మంచు కొండల నుంచి విరిగి పడ్డ మంచు చరియలు చూపిన ప్రకోపంతో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చేపట్టిన రెండు జల విద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఎన్టీపీసీ తపోవన్ విష్ణుగడ్ ప్రాజెక్టు 520 మెగావాట్లు, రిషి గంగ విద్యుత్ ప్రాజెక్టు 13.2 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టాయి. కానీ వరద ఉధ్రుతికి రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయని తెలుస్తున్నది.
ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ స్పందిస్తూ నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టు విభాగం దెబ్బ తిన్నదని ట్వీట్ చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సారథ్యంలో ఘటనాస్థలాన్ని సందర్శించిన నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ.. తక్షణం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించాలని ఎన్టీపీసీ ఎండీని ఆదేశించింది. ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు దాదాపు కొట్టుకుపోగా, గతేడాది జల విద్యుత్ ప్రారంభించిన రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు కూడా దెబ్బతిన్నది.
ఇంతకుముందు 2016లో వచ్చిన వరదలకు రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు దెబ్బతిన్నది. అయితే అలక్‌నంద నదిపై చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టులు సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఐఐటీ-కాన్పూర్ స్టార్టప్ ఆధ్వర్యంలో అభివ్రుద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో సెంట్రల్ వాటర్ కమిషన్.. సకాలంలో ఈ ప్రాంతంలోని నీటి నిల్వల సామర్థ్యం పెరుగుతున్న వైనాన్ని పర్యవేక్షించడంతోపాటు సంబంధిత ప్రాంతాల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసింది.
ధౌలిగంగలో సాధారణ నీటిమట్టానికి మించి 3 మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తున్నది. దీంతో 170 మంది గల్లంతయ్యారు. వారంతా మరణించినట్లుగా ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే పది మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు వెలికి తీశాయి. మరో 16 మందిని సురక్షితంగా కాపాడారు. గల్లంతైనవారికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడుగురు మృతదేహాలను గుర్తించామని, 125 మందికిపైగా ఆచూకీ గల్లంతైందని చెప్పారు. వీరితోపాటు ఐదుగురు గొర్రెల కాపరులు, 180 గొర్రెలు కూడా వరదలో కొట్టుకుపోయినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మరో రూ.2 లక్షలను కేంద్రం అందజేయనున్నది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నారు.
విపత్తుకు గల కారణాలపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని సీఎం తెలిపారు. వరదలకు సంబంధించిన పాత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ రంగంలోకి దిగాయి.
ఆర్మీ సుమారు 600 మంది సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించింది. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం చాపర్లను కూడా సిద్ధంచేసింది. మరోవైపు, నేవీ కూడా రెండు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్ ధ్రువ్ చాపర్‌ను రంగంలోకి దించింది. అవసరమైతే మరిన్ని హెలికాప్టర్లను వినియోగిస్తామని తెలిపింది. ఏడు డైవింగ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నది.
ధౌలిగంగ నదిలో నిన్న రాత్రి మరోసారి నీటిమట్టం పెరిగింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నందా దేవి హిమానీనదం విరిగిపడింది. దీంతో ధౌలిగంగ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా, నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో చమోలీ ప్రాంతంలో పోలీసుల ప్రజలను అప్రమత్తం చేశారు.
తపోవన్-విష్ణుగఢ్ హైడర్ ప్రాజెక్టు టన్నల్‌లో 35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాలతో టన్నల్ వద్ద శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
More Stories
టైగర్ రిజర్వ్‌లో మూడు రోజుల్లో 10 ఏనుగుల మృతి
సైబర్ మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్
ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి