సీఎం కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తాం.. జైలుకు పంపిస్తామని బీజేపీ నేత విజయశాంతి హెచ్చరించారు. కేసీఆర్ దొర గిరిజనుల భూములు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటే తెలంగాణ ఎడారేనని విజయశాంతి ధ్వజమెత్తారు.
అధికారం ఉందని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని చెబుతూ టీఆర్ఎస్
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, మాజీ ఎంపీ జి వివేక్ లతో కలసి ‘గిరిజన భరోసాయాత్ర’ పేరుతో ఆమె గిరిజన భూముల సందర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండాకు ఒక ప్రత్యేక బస్సు లో వెళ్ళారు. మఠంపల్లి మండలంలో తమ భూములు కబ్జా చేశారని స్థానిక గిరిజనులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల అంతు చూస్తామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. గిరిజనుల భూములు తిరిగి ఇచ్చేయాలని, గిరిజనులపై లాఠీచార్జ్ చేయించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతామని ఆయన మరోసారి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు డ్రైవర్ అయ్యారని ఎద్దేవాచేశారు.
నాగార్జునసాగర్ నిర్వాసిత గిరిజనుల భూములను కబ్జా చేశారని అంటున్నారు. గుర్రంపోడు తండా.. సర్వేనంబర్ 540లోని 18వందల 76 ఎకరాల భూములను సర్కారు అండతో.. స్థానిక టీఆర్ఎస్ నేతలు, వారి బినామీలు ఆక్రమించుకున్నారని విమర్శిస్తున్నారు.
ఇలా ఉండగా, మఠంపల్లి మండలం పెదవీడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్లేడ్ ఆగ్రో కంపెనీ భూముల దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం షెడ్డును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జీలో పలువురికి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్, రాజాసింగ్, విజయశాంతి సర్వే నెంబర్ 540 వివాదాస్పద భూముల దగ్గరకు చేరుకున్నారు. గిరిజనుల మీద దాడులు చేసినా, బెదిరించినా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. గిరిజనుల మీద దాడులు చేయడంతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టిన వారిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
ఎస్డిఎఫ్ నిధులతోపాటు ఖమ్మంకు అదనంగా సాయం
నివాసముంటున్న ఇళ్లు కూల్చం