విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు… సోము వీర్రాజు 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు… సోము వీర్రాజు 

పెట్టుబడుల  ఉపసంహరణలో భాగంగా  నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వారికి ఇవ్వాలనే విధానంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ కర్మాగారాన్ని సహితం అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాలలో నిరసనలు వ్యక్తం కావడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఎన్ని పోరాటాల ఫలితంగా ఇది వచ్చినదని తమకు తెలుసని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజల ఆందోళనల పట్ల రాష్ట్ర బిజెపి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర ప్రజల అభిమతాన్ని వెల్లడిస్తామని చెప్పారు. 

పార్టీ ఎంపీ జీవియల్ నరసింహారావు, ఎమ్యెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ కేంద్ర ఆర్ధిక మంత్రి, ఉక్కు మంత్రులను కలసి పరిస్థితులను వివరిపనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీకి వెడుతున్న తాను కూడా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో పరిస్థితులు వివరిస్తానని వివరించారు. 

అయితే, పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, కేవలం విశాఖ ఉక్కుకు మాత్రమే పరిమితం కాదని ఆయన గుర్తు చేశారు . 

ఇలా ఉండగా,  పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. షేర్‌ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. 

అయితే, స్టీల్‌ ప్లాంట్‌ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తీసుకెళ్లేది కాదని స్పష్టం చేశారు. నష్టాలతో మునిగిపోయి భవిష్యత్ లో మూసివేసేదాని కన్నా వేరేవారికి ఇచ్చి లాభదాయకంగా నడిపించే ప్రయత్నం చేయడం మంచిదే కదా అని ప్రశ్నించారు. 

ప్రభుత్వం వ్యాపారం చేయరాదనే విధానంలో భాగంగా, మొత్తం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నట్లు తెలిపారు.  టీడీపీ, వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ మాత్రం ఆగదని సుజనాచౌదరి స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై పలువురు సూచిస్తున్న విధంగా ప్రత్యామ్న్యాయ మార్గాలు అన్వేషించడంలో తప్పేమి ఉండదని చెప్పుకొచ్చారు