ఎన్నికల మేనిఫెస్టోను ఉపసంహరించుకున్న టీడీపీ 

పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో-2021ను ఉపసంహరించుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, అశోక్‌బాబు కలిసి మేనిఫెస్టో ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలను అమలుచేశారని, ఏ నిబంధనల ప్రకారం ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగామని పేర్కొన్నారు.

అయితే కోర్టుకు వెళ్లాలని ఎస్‌ఈసీ సమాధానమిచ్చారని వర్ల రామయ్య తెలిపారు. వైసీపీ అధికార దుర్వినియోగంపై ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామని బోండా ఉమ తెలిపారు. టీడీపీ విజ్ణప్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరామని, ఎస్ఈసీపై గౌరవంతో మేనిఫెస్టోను విత్‌డ్రా చేసుకున్నామని బోండా ఉమ ప్రకటించారు.

పార్టీ రహితంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నిలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. దానిని ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ ఆ పార్టీకి నోటీసులిచ్చింది.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు తమ పార్టీకి చెందిన పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో-2021ను రూపొందించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేత ఆవిష్కరింపజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గత నెల 29న ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. 

మేనిఫెస్టో పేరిట పలు పథకాలను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామంటూ.. పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించడం చట్ట విరుద్ధమని అందులో తెలిపారు. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 దీంతో ఎస్‌ఈసీ గత నెల 30న మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులిస్తూ.. ఫిబ్రవరి 2లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఆయన 2న వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధమని.. వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని, ఆ పత్రాలు విడుదల చేయరాదని ఆదేశించింది.