ప్రభుత్వ సెక్యూరిటీస్‌ మార్కెట్‌లోకి రిటైల్‌ ఇన్వెస్టర్లు  

ప్రభుత్వ సెక్యూరిటీస్‌ మార్కెట్‌లోకి రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా ప్రవేశించేందుకు రిజర్వు బ్యాంక్‌ అనుమతించింది. ప్రభుత్వ ‌ బాండ్లలో మదుపర్ల ప్రమేయాన్ని పెంచాలన్న లక్ష్యంలో భాగంగానే సర్కారీ సెక్యూరిటీలను నేరుగా కొనేందుకు చిన్న మదుపర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ తెలిపారు.  ఆసియా దేశాల్లో ఈ రకమైన అవకాశం కల్పించిన తొలి దేశం భారతేనని చెప్పారు. 

రూ.12 లక్షల కోట్ల ప్రభుత్వ రుణ సమీకరణ ప్రక్రియకు వచ్చే ఆర్థిక సంవత్సరం వేదిక కానున్నది. ఈ క్రమంలోనే రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచీ బాండ్ల ద్వారా ప్రభుత్వం రుణాలను సమీకరించే వీలును తాజా నిర్ణయంతో ఆర్బీఐ కల్పించింది. ప్రస్తుతం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలపై గోబిడ్‌ వేదిక ద్వారానే ప్రభుత్వ బాండ్లను కొనే అవకాశం చిన్న మదుపర్లకు ఉన్నది. ఆర్బీఐ నిర్ణయంతో ఇక నేరుగా వీరంతా ప్రభుత్వ బాండ్లను కొనవచ్చు. మరోవైపు తమ ఈ నిర్ణయం బ్యాంక్‌ డిపాజిట్లను ఆటంకపర్చబోదన్న అభిప్రాయాన్ని దాస్‌ వ్యక్తం చేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసినట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. గత వారం ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనా (11 శాతం) కంటే ఇది 0.5 శాతం తక్కువ. మరోవైపు ద్రవ్యోల్బణంపై కూడా శక్తికాంత దాస్‌ స్పందించారు. 

సమీప భవిష్యత్తులో కూరగాయల ధరలు పెరగకపోవచ్చని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ మళ్లీ గాడిలో పడుతున్నదని చెప్పారు. రిటైల్‌ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని జీడీపీలో 5.8 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో టోకు ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గవచ్చని, ఈ ఏడాది డిసెంబర్‌లో ఇది 4.3 శాతానికి దిగిరావచ్చని అంచ నా వేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ఊతమిస్తున్నదని అభిప్రాయపడ్డారు. 

కొవిడ్‌-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగంగా పుంజుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య, మౌలిక వసతుల రంగాలకు కేంద్ర బడ్జెట్‌ ఊతమిచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఒకే దిశలో సాగుతున్నదని, అది ముందుకేనని శక్తికాంత దాస్స్పష్టం చేశారు.

ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు,నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థల కస్టమర్లు, డిజిటల్‌ లావాదేవీల వినియోగదారుల సమస్యల కోసం వేర్వేరుగా పనిచేస్తున్న కన్జ్యూమర్‌ గ్రీవాన్సెస్‌ పరిష్కార వేదికలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నామని ఆర్బీఐ తెలిపింది. ఈ మూడింటిని సింగిల్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌లోకి తెస్తామని చెప్పింది. 

ఖాతాదారుల సౌకర్యార్థం, సులువుగా సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌కల్లా అమల్లోకి తేవాలని చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. రెపో, రివర్స్‌ రెపో రేట్లలో వరుసగా నాలుగోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. 

దీంతో ప్రస్తుతం 4 శాతంగా ఉన్న రెపో రేటు, 3.35 శాతంగా ఉన్న రివర్స్‌ రెపో రేటు అలాగే కొనసాగనున్నాయి. ఆరుగురు సభ్యులతో కూడిన రిజర్వు బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ప్రస్తుతానికి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు చెప్పారు. 

దేశ ఆర్థిక వృద్ధి రేటుకు వెన్నుదన్నుగా  నిలవడంతోపాటు ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 సంక్షోభ ప్రభావాన్ని తగ్గించాలన్న లక్ష్యంతోనే కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తుట్లు తెలిపారు. కరోనా కాటుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు మరింత అండగా నిలిచేందుకు అవసరమైతే భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గిస్తామని ప్రకటించారు.

ఇలా ఉండగా, దేశంలో డిజిటల్‌ కరెన్సీ విధానంపై ఆర్బీఐ అంతర్గత కమిటీ పనిచేస్తున్నది. అతి త్వరలో ఓ నిర్ణయం వస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో తెలిపారు. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలు, వర్చువల్‌ కరెన్సీలు, ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీలపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ.. అధికారికంగా ఓ డిజిటల్‌ కరెన్సీని తేవాలని చూస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల నిషేధం దిశగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిటీ పరిశీలన తర్వాత.. ఆర్బీఐ డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి రాగలదన్న విశ్వాసాన్ని కనుంగో వ్యక్తం చేశారు.