రైతులు మన దేశానికి వెన్నెముక అని, దేశాభివృద్ధిని నడుపుతున్నది వారేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా రైతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీ చౌరాలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, నిర్వహిస్తున్న కార్యక్రమాలను మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
చౌరీ చౌరా సంఘటనకు నేటికీ ప్రాధాన్యం ఉందని మోదీ చెప్పారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో రైతుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. నేడు కూడా రైతులు మన దేశ అభివృద్ధిని నడుపుతున్నారని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం తన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని హామీ ఇచ్చారు.
మండీలు లాభదాయకంగా మారడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరొక 1,000 మండీలను ఈ-నామ్‌కు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో రైతులకే పెద్ద పీట వేశామని గుర్తు చేశారు. రైతులు స్వయం సమృద్ధి సాధించడం కోసం, వారిని సాధికారులను చేయడం కోసం గడచిన ఆరు సంవత్సరాల నుంచి అనేక చర్యలను అమలు చేస్తున్నామని తెలిపారు.
దేశ సమైక్యతకే పెద్ద పీట వేస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు. దేశ ప్రతిష్ఠ అన్నిటి కన్నా గొప్పదని చెప్పారు. చౌరీ చౌరా అమరుల గురించి తగినంత చర్చ జరగడం లేదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర పుటల్లో ఈ యోధులకు ప్రాధాన్యం దక్కకపోయినా, వారి రక్తం మన దేశ గడ్డలో ఉందని, అది నిరంతరం మనల్ని ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1922లో సహాయ నిరాకరణోద్యమం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని స్వాతంత్య్ర సమర యోధులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్ర ఆగ్రహానికి గురైన నిరసనకారులు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు.
ఈ సంఘటనలో 23 మంది పోలీసులు, ఇతర అధికారులు మరణించారు. అనంతరం పోలీసులు వందల మందిని అరెస్టు చేశారు. 228 మందిపై విచారణ జరిగింది. ఆరుగురు విచారణ సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 172 మందికి బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. మిగిలినవారికి సుదీర్ఘ కాలం జైలు శిక్షలు విధించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ సంఘటన ఓ మైలురాయి వంటిది.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి