జనవరిలో రూ.1.08 లక్షల కోట్లకు తగ్గిన వాణిజ్య లోటు 

జనవరిలో రూ.1.08 లక్షల కోట్లకు తగ్గిన వాణిజ్య లోటు 

గత నెలలో దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 5.37 శాతం వృద్ధిచెంది 27.24 బిలియన్‌ డాలర్ల (రూ.1,98,896 కోట్ల)కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫార్మా, ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవడం ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో ఔషధ ఎగుమతులు 16.4 శాతం (293 మిలియన్‌ డాలర్లు), ఇంజినీరింగ్‌ ఎగుమతులు 19 శాతం (1.16 బిలియన్‌ డాలర్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది.

అలాగే ఆయిల్‌ మీల్స్‌ (253%), ఇనుప ఖనిజం (108.66%), పొగాకు (26.18%), బియ్యం (25.86%), పండ్లు-కూరగాయలు (24%), తివాచీలు (23.69%), హస్తకళలు (21.92%), సుగంధ ద్రవ్యాలు (20. 35%), పింగాణీ-గాజు ఉత్పత్తులు (19%), తేయాకు (13.35%), జీడిపప్పు (11. 82%), ప్లాస్టిక్‌ (10.42%), రసాయనాల (2.54%) ఎగుమతుల్లో కూడా ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్లు వివరించింది.

ఇదే సమయంలో దిగుమతులు 2 శాతం పెరిగాయని, దీంతో ఈ ఏడాది జనవరిలో వాణిజ్యలోటు 14.75 బిలియన్‌ డాలర్ల (రూ. 1,07,694 కోట్ల)కు దిగివచ్చిందని స్పష్టం చేసింది. గతేడాది జనవరిలో దేశ వాణిజ్య లోటు 15.3 బిలియన్‌ డాలర్లు (రూ. 1,11, 755 కోట్లు)గా ఉన్నట్లు వాణిజ్య శాఖ తెలిపింది.