బడ్జెట్ రెండోదశ సమావేశాల్లో విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో విపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బడ్జెట్ తొలి దశ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం, చర్చ ఉంటుందని చెప్పారు.

బడ్జెట్‌పైనా, ఏదైనా అత్యవసర బిల్లులపైనా చర్చ ఉంటుందని చెప్పారు. తక్కిన రెండో దశ సమావేశాల్లో విపక్షాలు ఏమి అడగాలన్నా అడగవచ్చని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు.

కాగా, బడ్జెట్ సమావేశాల తొలిరోజు జరిగిన రాష్ట్రపతి ప్రసంగాన్ని 16కు పైగా విపక్ష పార్టీలు బహిష్కరించాయి. రైతు ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు ఈ బాయ్‌కాట్ చేపట్టాయి. 2020-21 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతారు.

బడ్జెట్ తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకూ జరుగుతాయి. కొద్దిపాటి విరామానంతరం బడ్జెట్ రెండో దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరుగుతాయి. రాజ్యసభ పనివేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, లోక్‌సభ పనివేళల మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 వరకూ (జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంతో సహా) నిర్దేశించారు.