అసమర్ధ ముఖ్యమంత్రి నారాయణ స్వామి

కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి సమర్ధవంతంగా పనిచేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పుదుచ్చేరిలో ఒకరోజు పర్యటన కోసం నడ్డా ఆదివారంనాడిక్కడకు వచ్చారు. 

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, నారాయణస్వామి కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు జార్ఖాండ్‌కు రూ.5,000 కోట్ల రుణాలు మాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ, పుదుచ్చేరిలో మాత్రం రుణాల మాఫీ చేయలేదని, ప్రస్తుతం ఆయన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

పుదుచ్చేరికి ఆయన చేసిన న్యాయం ఏమిటో దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో 52 శాతం మంది పేదరికపు రేఖకు దిగువన ఉన్నారని ధ్వజమెత్తారు. వాజ్‌పేయి హయాంలో పుదుచ్చేరికి 70 శాతం గ్రాండ్ ఇన్ ఎయిడ్‌గా ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ సీఎంగా ఉన్న నారాయణ స్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దానిని 30 శాతానికి తగ్గించారని నడ్డా దుయ్యబట్టారు.

పుదుచ్చేరికి త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు అవినీతి లేని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాన్ని బిజెపి అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ గల 30 అసెంబ్లీ స్థానాలలో తమ కూటమి 23 స్థానాలు గెల్చుకోగలదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చాలాకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం లేదని చెబుతూ 76 శాతం మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, సహకార, ఖాదీ రంగాలలో నాలుగేళ్లుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. కాగా, ఈ ఏడాదిలోనే తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే భాగస్వామ్య పార్టీగా బీజేపీ ఉంది.