మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు

మయన్మార్‌లో మరోసారి సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ దేశ మిలటరీ ప్రకటించింది. సోమవారం తెల్లవారు జామున మిలటరీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌‌ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది. 
 
ఆ దేశ పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైన్యం తిరుగుబాటు చేసింది. మయన్మార్‌ రాజధానిలో ముందస్తుగా సైన్యం మొబైల్‌ సేవలను, ఇంటర్‌నెట్‌ను నిలిపివేసింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ ఆధిక్యంతో తిరిగి విజయం సాధించింది. 
 
 అయితే అక్కడ ప్రభుత్వంపై పట్టుకల్గిన సైన్యం ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని పేర్కొనడంతో అక్కడ పరిస్థితులు ఉద్రికత్తలకు దారి తీశాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అక్రమాలపై ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
 
మయన్మార్‌లోని ప్రధాన నగరమైన యాంగోన్ సిటీ హాల్ బయట సైనికులు మోహరించినట్లు తెలుస్తున్నది. అలాగే దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. దేశ అధ్యక్షుడు విన్‌ మైంత్‌, సూకీ, ఇతర నేతలను సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఎల్‌డి అధికార ప్రతినిధి మయో న్యూంట్‌ తెలిపారు. ఈ ఘటనపై ప్రజలు ఆవేశపూరితంగా స్పందించవద్దని, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని సూచించారు.
 
 తనను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే సమాచారం కోసం ఓ వార్తా సంస్థ ప్రయత్నించగా….ఫోన్‌ లైన్లు పనిచేయలేదు. సైనిక అధికార ప్రతినిధి కూడా ఎటువంటి ఫోన్‌కు స్పందించలేదు. అయితే యాంగోన్‌ ప్రధాన నగరంలో సిటి హాల్‌ వెలుపల సైనికులను మోహరించినట్లు కొంత మంది సాక్షులు చెబుతున్నారు.
 
 మయన్మార్ మిలటరీ కుట్రపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ప్రజా నేత అంగ్ సాన్ సూకీతో సహా ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని ఆస్ట్రేలియా కోరింది.