రైతుల ఉద్యమంతో పాక్ స్లీపర్ సెల్స్ క్రియాశీలం!

దేశంలో  రైతుల  ఆందోళనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్‌ స్లీపర్‌ సెల్స్‌ ప్రస్తుతం పూర్తిగా క్రియాశీలం  అయ్యాయయని, చొరబాటుకు యత్నించే అవకాశం ఉందని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ హెచ్చరించారు.
చైనాతో కలిసి దాయాది దేశం, భారత్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. రైతు నిరసనలు మొదలైన నాటి నుంచి పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి పెద్ద మొత్తంలో  ఆయుధాలు, డబ్బు, హెరాయిన్‌ వంటివి డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసను ప్రస్తావిస్తూ ‘‘ఇలాంటి ఘటనల్లో తప్పెవరిది అనేది కచ్చితంగా చెప్పలేం. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి” అని పేర్కొన్నారు.

నిజానికి ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే పాక్‌ వైపు నుంచి డ్రోన్‌ డెలివరీ ఎందుకు జరుగుతోంది? డబ్బు, ఆయుధాలు, హెరాయిన్‌ ఎందుకు ఇక్కడకు వస్తోంది? అన్న ప్రశ్నలు తనను  ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని తెలిపారు. “దాదాపు 30 డ్రోన్లను మేం గుర్తించాం. ఈ విషయాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అని వెల్లడించారు.