రైతులకు, నాకు ఒకే ఒక ఫోన్‌కాల్ మాత్రమే దూరం

చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ఆందోళనను ప్రస్తావిస్తూ వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేతపై సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గతంలో తాము సూచించిన ప్రతిపాదనలకు ఇంకా కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. 
 
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించగా ప్రధాని సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ వైఖరిని తమ సహచరులకు చెప్పాలని మోదీ అఖిలపక్ష నేతలకు సూచించారు. ‘‘చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనమందరమూ దేశం గురించి ఆలోచించాలి’’ అని మోదీ అఖిలపక్ష నేతలతో వ్యాఖ్యానించారు.
 
 ‘‘కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్  తోమర్ అన్న వ్యాఖ్యలనే నేను పునరుద్ఘాటిస్తున్నా. మనం ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. మేము ఓ ప్రతిపాదన పెడుతున్నాం. ప్రస్తుతానికి వీరు వెళ్లండి. మీ (రైతులతో) చర్చించండి. వారెమన్నారో మాకు ఓ ఫోన్ చేయండి. సరిపోతుంది.’’ అన్న తోమర్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు.
 
 ఈ విషయంపై తాము ఎలాంటి అరమరికల్లేకుండా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని తెలుపుతూ రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయ చట్టాలు వాయిదా వేయడానికి సిద్ధమని వెల్లడించారు. బడ్జెట్‌లో రైతులకు మరిన్ని వరాలు ప్రకటిస్తామని, పార్లమెంట్‌ సమావేశాలను విపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
 
రైతు చట్టాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానం ఇప్పుడిప్పుడే మారుతోందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ సమావేశం అనంతరం ప్రశంసించారు.ప్రభుత్వం పక్షాన ప్రతిపాదించిన ప్రతిపాదనలు రైతులకు నచ్చితే ఒక ఫోన్ కాల్ చేయవచ్చని, రైతులకు, ప్రభుత్వానికి ఒకే ఒక ఫోన్ కాలం మాత్రమే దూరమని పేర్కొన్నారని అధీర్ వివరించారు.