ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడులో ఇరాన్ హస్తం!

ఢిల్లీలో ఇరాన్ ఎంబసీ వద్ద గత సాయంత్రం జరిగిన పేలుడు ఉగ్రవాద దాడిఅని,  ఈ దాడి ఇరాన్ హస్తం ఉండివచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన పేలుడుకు, 2012లో ఆ దేశ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులకు సంబంధం ఉండి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ అంబాసిడర్ రోన్ మాల్కా ఓ వార్తా సంస్థతో శనివారం మాట్లాడుతూ ఈ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన పేలుడు నేపథ్యంలో భారత ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. తమకు మద్దతు, రక్షణ, సహాయం అందిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. 

2012లో ఇజ్రాయెలీ దౌత్యవేత్తలపై ఉగ్రవాద దాడులు జరిగాయని, ఢిల్లీలోని ఇజ్రాయెలీ ఎంబసీకి సమీపంలోనే ఓ దాడి జరిగిందని చెప్పారు. తాజా దాడికి, ఆ దాడులకు సంబంధం ఉండే అవకాశం ఉందని తెలిపారు. వ్యూహాత్మకంగా ఈ దాడులు జరుగుతూ ఉండవచ్చునని భావిస్తున్నారు. 

శుక్రవారం జరిగిన దాడిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇది ఇజ్రాయెలీ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడి అని, ఈ దుశ్చర్య వెనుక ఎవరున్నారో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని చెప్పారు. భారత ప్రభుత్వంపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని అంటూ . భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య సంపూర్ణ సహకారం ఉందని తెలిపారు.

పేలుడు ప్రాంతంలో  ఓ లేఖ 

 ఇలా ఉండగా, పేలుడు జరిగిన చోట ఓ లేఖను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఒకటిన్నర పేజీలు ఉన్న ఈ లేఖలో ఇజ్రాయెలీ ఎంబసీ అధికారులకు హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ పేలుడు కేవలం ట్రయిలరేనని, అసలు కథ ముందు ఉందని ఈ లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్, భారత దేశం మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవాలను జరుపుకున్నారు. అదే సమయంలో ఈ దాడి జరగడం యాధృచ్ఛికం కాదని, కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని ఇజ్రాయెలీ ఎంబసీ వర్గాలు చెప్తున్నాయి.

విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద పేలుడు జరిగిన చోట దొరికిన లేఖలో, ఇరాన్ జనరల్ ఖాసిం సోలిమనీ, టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహిసిన్ ఫక్రిజదేహ్‌‌లను అమర వీరులుగా అభివర్ణించినట్లు తెలుస్తోంది.

 జనరల్ ఖాసిం గత ఏడాది జనవరిలో ఇరాక్‌లో అమెరికన్ డ్రోన్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. న్యూక్లియర్ సైంటిస్ట్ మొహిసిన్ 2020 నవంబరులో ఉత్తర ఇరాన్‌లో జరిగిన దాడిలో మరణించారు. ఈ లేఖను ఇజ్రాయెల్ ఎంబసీ అధికారులను ఉద్దేశించి రాసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఇతర వివరాలను వారు వెల్లడించలేదు. 

2012 ఫిబ్రవరి 13న న్యూఢిల్లీలో ఓ కారుకు అమర్చిన మ్యాగ్నటిక్ బాంబు పేలింది. ఈ సంఘటన కూడా ఇజ్రాయెలీ ఎంబసీ సమీపంలోనే జరిగింది. ఈ దాడిలో ఓ ఇజ్రాయెలీ డిఫెన్స్ రాయబారి సతీమణి గాయపడ్డారు. అదే రోజు జార్జియన్ రాజధాని టిబిలిసిలో కూడా ఇజ్రాయెలీ దౌత్యవేత్త కారు క్రింద ఓ బాంబును పెట్టారు. 

అయితే ఆ బాంబు పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ దుశ్చర్యల వెనుక ఇరాన్ ఉందని 2012లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. 

 పేలుడు ప‌దార్ధాల్లో పీఈటీఎన్ గుర్తింపు 

ఈ పేలుడు ఘ‌ట‌న‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.  బ్లాస్ట్ కోసం వాడిన పేలుడు ప‌దార్ధాల్లో పీఈటీఎన్ ఉన్న‌ట్లు గుర్తించారు.  పీఈటీఎన్ అంటే పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్‌.  ఇది హై గ్రేడ్ మిలిట‌రీ పేలుడు ప‌దార్థం.  అయితే ఇజ్రాయెల్ ఎంబ‌సీ వ‌ద్ద జ‌రిగిన పేలుడులో ఈ ప‌దార్ధాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

ఇలాంటి హై గ్రేడ్ పేలుడు ప‌దార్ధాల‌ను  ఆల్‌-ఖ‌యిదా లాంటి ఉగ్ర సంస్థ‌లు మాత్ర‌మే వినియోగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ ఉగ్ర సంస్థ‌.. ఆ పేలుడుకు తామే బాధ్యుల‌మ‌ని ప్ర‌క‌టించింది. కానీ విచార‌ణాధికారులు మాత్రం ఇంకా దీన్ని ద్రువీక‌రించాల్సి ఉంది.

గ‌త రాత్రి ఇరాన్‌కు వెళ్ల‌వ‌లిసిన ఓ విమానాన్ని ఆల‌స్యం చేశారు.  అన్ని విమానంలో వెళ్తున్న ప్రయాణికులను సెర్చ్ చేశారు. వారి ప్రొఫైల్‌ను కూడా తీసుకున్నారు. కానీ వారి వ‌ద్ద ఏమీ ల‌భించ‌లేద‌ని అధికారులు తెలిపారు.