అమెరికాలో మరోసారి మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం 

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి మహాత్మ గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని ఓ పార్కులో ఈ నెల 27న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 విద్వేషపూరితమైన ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించాలని ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు.  కాలిఫోర్నియాలోని డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఈ ఘటన జరిగింది. కాంస్యంతో చేసిన ఆరు అడుగుల ఎత్తు, 294 కిలోల బరువు గల గాంధీ విగ్రహాన్ని దుండగులు బేస్ నుంచి పడగొట్టేశారు. అనంతరం అక్కడి నుంచి ఈడ్చుకుని వచ్చి కొద్ది దూరంలో పడేసి వెళ్లిపోయారు. 
 
దీంతో విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. బుధవారం ఉదయం(27వ తేదీన) ఓ పార్క్ ఉద్యోగి విగ్రహం కిందిపడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డేవిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు లూకాస్ ఫ్రీరిచ్స్ మాట్లాడుతూ ధ్వంసమైన విగ్రహాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని, దీనికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న డేవిడ్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
‘డేవిస్‌లోని కొంత భాగానికి ఈ విగ్రహం సాంస్కృతిక చిహ్నంగా ఉంది. మేము ఈ ఘటనను చాలా తీవ్రంగా తీసుకుంటున్నాము’ అని డేవిస్ పోలీసు శాఖ డిప్యూటీ చీఫ్ పాల్ డోరోషోవ్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై భారతీయ-అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో దీనికి కారణమైన వారిని వదిలిపెట్టొదని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎన్నారైలు కోరారు.