ప్రపంచం కరొనను ఓడించబోతుంది!

ప్రపంచం కరోనా వైరస్‌ను ఓడించబోతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ మహమ్మారి ఓటమి అత్యంత సమీపంలో ఉందని స్పష్టం చేశారు. 2020వ సంవత్సరాన్ని కరోనా వైరస్ వ్యాక్సిన్ల అభివృద్ధి సంవత్సరంగా అభివర్ణించారు.

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కార్యనిర్వాహక మండలి 148వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. వివిధ దేశాల్లో సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన ధోరణుల్లో చాలా తేడాలు ఉన్నప్పటికీ, మనం ముందస్తు నిరోధక, నియంత్రణ, సహకార వ్యూహంతో ఈ మహమ్మారిని ఓడించబోతున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ మహమ్మారి ఓటమి అంచుల్లో ఉందని చెబుతూ  2020వ సంవత్సరం కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధి సంవత్సరం అయితే, 2021వ సంవత్సరం ఈ వ్యాక్సిన్లను ప్రపంచంలో అవసరం ఉన్నవారందరికీ చేర్చే సవాలుతో కూడిన సంవత్సరం అవుతుందని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ఈ సమయంలోనే అత్యంత విశిష్టమైన పాత్రను పోషించవలసి ఉందని చెప్పారు.

2020వ సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మనల్ని కమ్ముకున్న చీకట్లలో అత్యుత్తమ మానవత్వం ప్రకాశించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టం చేసుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చారు.