స్థానిక ఎన్నికల్లో హింసకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలి 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో హింసాత్మక ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గత ఏడాది ఏకగ్రీవ ఎన్నికలకోసం సాగించిన హింస, దౌర్జన్యాలు ఈ సారి జరుగకుండా ప్రభుత్వం చూడాలని స్పష్టం చేశారు.  ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని అభ్యర్ధించారు. 
 
ఈ నెల 29న మొదటి దశ ఎన్నికల నామినేషన్లు జరిగినప్పుడు ప్రభుత్వ వైఖరి వెల్లడవుతోంది అంటూ, ప్రభుత్వం దారి తప్పితే ఆ సాయంత్రం గవర్నర్ ను కలసి ఏమి చేయాలో చూస్తామని వెల్లడించారు. తమ పార్టీ వారెవ్వరూ దౌర్జన్యానికి దిగవద్దని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ జరిపి మంత్రులు,, ప్రతి ఎమ్యెల్యేలు, ఇతర నాయకులకు ఆదేశాలు ఇవ్వాలని వీర్రాజు కోరారు. 

స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు బుధవారం ఉదయం జనసేన నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇతర పార్టీలు పోటీలో ఉండొద్దనడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. తాము ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియపై చర్చిస్తామని, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

బీజేపీ, జనసేన కలిసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు వేసేలా చర్యలు చేపట్టాలని ఆయన ఎన్నికల కమీషన్ ను కోరారు. ఈనెల 29లోగా ఆన్‌లైన్ నామినేషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

కాగా, తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై తమకు స్పష్టమైన విధానం ఉందని చెప్పారు.  ఇరు పార్టీలు పొత్తుతో, అందరకీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇరు పార్టీలకు ఎక్కడెక్కడ ఎంత బలం ఉందో చూసి, అభ్యర్థులను ఎంపిక చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.