చిత్తూర్, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీలపై వేటు 

చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు నారాయణ భరత్‌ గుప్తా, ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఎ.రమేశ్‌రెడ్డిలపై బదిలీ వేటుపడింది. గతణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నిన్న ఉదయమే వారికి మౌఖికంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో నిన్న సాయంత్రమే వారు విధుల నుంచి తప్పుకున్నారు.

 చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు నారాయణ భరత్‌ గుప్తా, ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఎ.రమేశ్‌రెడ్డి లు గత సంవత్సరం మార్చిలో నిర్వహించిన ఎన్నికల సమయంలో  హింసను, అక్రమాలను నివారించడంలో విఫలమయ్యారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

ఆ ఆదేశాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. తాజాగా, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. బాధ్యతను విస్మరించిన అధికారులను వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్‌ఈసీ ఆదేశాలతో వారిని బదిలీ చేస్తూ సోమవారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బదిలీ అయిన వారి స్థానాల్లో ఆయా జిల్లాల జేసీలు కలెక్టర్లుగా వ్యవహరించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా మార్కండేయులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్‌ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చిత్తూరు ఎస్పీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీగా బాధ్యలు స్వీకరించనున్నారు.

కాగా, పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా చేపట్టే బాధ్యతలను పోలీసు ట్రైనింగ్‌ ఐజీ ఎన్‌.సంజయ్‌కు అప్పగించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆయన్ను నియమించగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో సంజయ్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించి  కమిషనర్‌తో సమావేశమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై చర్చించారు. నిరుడు మార్చిలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రత, బందోబస్తు ఎలా ఉండాలో వారు చర్చించారని చెబుతున్నారు.

సమస్యాత్మక గ్రామాల్లో బలగాల మోహరింపు, సమస్యలు సృష్టించే వ్యక్తుల బైండోవర్‌, డ్రోన్లతో పర్యవేక్షణ, నిఘా యాప్‌ గురించి ప్రజల్లో చైతన్యం, హద్దులు దాటిన వారిపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ‘నిఘా’ యాప్‌ను తయారు చేసి ఎవరు అక్రమాలకు పాల్పడినా ప్రజలే వీడియోలు, ఫొటోలు తీసి అందులో పెట్టేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని మీడియాతో పాటు అన్ని మార్గాల్లోనూ జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కమిషనర్‌ సూచించినట్లు సమాచారం.

 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో జరిగిన హింస, పల్నాడులో గత ఏడాది ఎన్నికల సందర్భంగా దాడులు, ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరిగిన దృష్ట్యా పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఐజీని ఆదేశించినట్లు తెలుస్తున్నది.