ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ లపై ఎన్నికల కమీషన్ అభిశంసన

ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలం ముగిసేవరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగకుండా అడ్డుకోవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితంగా అందుకు సహకరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉపక్రమించింది. వారిద్దరిని అభిశంసిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌లను ఎందుకు అభిశంసించాల్సి వచ్చిందో ఉత్తర్వుల్లో క్లుప్తంగా తెలియజేశారు.
 2021 ఓటర్ల జాబితా ప్రకటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని,  వీరి నిర్లక్ష్యం కారణంగా 2019 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ విధులు నిర్వర్తించలేదని, దీని వల్ల దాదాపు 3.61 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారని వివరించారు.
ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని, ఇది క్షమించి వదలేయడానికి వీలులేని విషయమని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే ఎన్నికల కమిషన్ కు ఉన్న స్వేచ్ఛను నీరుగార్చేయత్నమేనని తెలిపారు.
అభిశంసన ఉత్తర్వులను వీరి సర్వీసు రికార్డుల్లో కూడా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు,  సంబంధిత అధికారులకు పంపారు. ఎస్‌ఈసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత.. అందుకు సహకరించకపోవడమే గాకుండా, అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ద్వివేది, గిరిజాశంకర్‌ గీతదాటారన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి.
 
 పైగా, పైగా ఎస్‌ఈసీపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. పైగా ప్రభుత్వ పెద్దలే 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతితో హైకోర్టులో కేసు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. పాత జాబితా నిర్ణయానికి కారణం పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులేనని ఎస్‌ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొనాల్సి వస్తుంది.