రాష్ట్రపతి ఆవిష్కరించిన నేతాజీ ఫోటోపై రాజకీయ దుమారం 

కొద్దీ నెలల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న వేళ నేతాజీ సుభోష్ చంద్రబోస్ 125వ జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా పెద్ద ఎత్తున దేశంలో, విదేశాలలో జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించి, కార్యాచరణకు సమాయత్తం కావడంతో ఎక్కడికక్కడ రాజకీయ దుమారం లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. 
 
కొలకత్తాలో ఉత్సవాల  ప్రారంభ కార్యక్రమంలోనే “జై శ్రీరామ్” నినాదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా  బెనర్జీ రసభ  సృష్టించగా,  తాజాగా అదే రోజున రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లో ఆవిష్కరించిన నేతాజీ చిత్రపటంపై వివాదం రేపే ప్రయత్నం చేశారు. 
అసలు ఈ చిత్రం నేతాజీది కానే కాద‌ని, 2019లో ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన గుమ్‌నామీ సినిమాలో న‌టించిన ప్ర‌సేన్‌జిత్ ఛ‌ట‌ర్జీద‌ని తృణ‌మూల్‌తోపాటు ప‌లువురు ప్రముఖ జర్నలిస్ట్ లు ఆరోపణలు చేస్తూ ట్వీట్ ల వర్షం కురిపించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్ ఆ ఆరోపణలను కొట్టివేయడంతో వారంతా  నాలిక కరచుకొని, తమ ట్వీట్ లను తొలగించుకున్నారు. ఏనాడూ నేతాజీని స్మరించుకొననే ప్రముఖులకు అకస్మాత్తుగా ఆయనకు బదులు మరొకరి చిత్రంను ఆవిష్కరించారని ఆసక్తి కనబరచడం వారి సంకుచిత రాజకీయ  ధోరణులనే  వెల్లడి చేస్తుంది.
ఈ చిత్రాన్ని నేతాజీ కుటుంబ‌మే ప్ర‌ముఖ క‌ళాకారుడు, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత ప‌రేష్ మైటీకి ఇచ్చింద‌ని వెల్లడి కావడంతో అటువంటి వారి నోళ్లు మూతబడ్డాయి. అస‌లు ఆ ఫొటో ప్ర‌సేన్‌జిత్‌లాగా అనిపించ‌డం లేద‌ని, ఇది అన‌వ‌స‌ర వివాద‌మ‌ని పలువురు నెటిజన్లు వివాదం లేవనెత్తిన వారిపై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.
ఈ చిత్రంపై తొలుత తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మోయిత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రామ మందిరానికి రాష్ట్ర‌ప‌తి రూ.5 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చిన త‌ర్వాత ప్ర‌సేన్‌జిత్ ఫొటో ఆవిష్క‌రించి నేతాజీకి నివాళుల‌ర్పిస్తున్నారు. దేవుడా ఇండియాను కాపాడు ఎందుకంటే ప్ర‌భుత్వం ఎలాగూ కాపాడ‌దు అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
రాష్ట్రపతి ఆవిష్కరించిన చిత్రంను ప్రముఖ చిత్రకళాకారుడు పరేష్ మైటీ తయారు చేశారని, నేతాజీ ముని మేనల్లుడు జయంతి బోస్ రక్షిత్ ఇచ్చిన నేతాజీ ఫోటో ఆధారంగా చేశారని అంటూ జర్నలిస్ట్ నిస్టుల హెబ్బార్ ట్వీట్ చేశారు.

వాస్తవం వెలుగులోకి రావడంతో నటి రిచా చద్దా, బెంగాల్ కాంగ్రెస్ లు సహితం తమ ట్వీట్ లను ఉపసంహరించుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సార్దేశాయ్ కూడా తన ట్వీట్ ను తొలగించుకొంటూ “అది సినిమా చిత్రం కాదని, ఒరిజినల్ చిత్రమే అని ప్రభుత్వం చెబుతున్నది” అంటూ తన తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు. బరఖా దత్, సాగరిక ఘోష్ వంటి పేరొందిన జర్నలిస్ట్ లు సహితం ఆ విధమైన ట్వీట్ లు ఇచ్చి అభాసుపాలయ్యారు.  

“రామమందిరం నిర్మాణం కోసం రాష్ట్రపతి కోవింద్ వ్యక్తిగతంగా రూ 5 లక్షల విరాళం ఇచ్చినప్పటి నుండి కొందరు ఆయనను లక్ష్యంగా చేసుకొంటూ వస్తున్నారు. నేడు నేతాజీ చిత్రంపై రేపిన దుమారం కూడా అందులో భాగమే” అంటూ తేజస్ ఎం ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. భారత దేశం గర్వించే యోధుడు నేతాజీ అసలు ఫోటో ఆధారంగానే ఈ చిత్రం వేసిన్నట్లు రాష్ట్రపతి భవన్ కూడా స్పష్టం చేసింది.