ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన తన ట్వీట్‌ చేశారు. 

కాగా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇండియన్ గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియల్‌ను ఉదయం 9.30 గంటల ప్రాంతలో సందర్శించిన ప్రధాని అమర వీరుల స్మృత్యర్థం పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 

ప్రధాని వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు వార్ మెమోరియల్ వద్ద ప్రధానితో కలిసి పాల్గొన్నారు. నేషనల్ మెమోరియల్ వద్ద ఉంచిన సెరిమోనియల్ బుక్‌లో ప్రధాని సంతకం చేశారు. దీంతో రిపబ్లిక్ డే పరేడ్ సెర్మనీ ప్రారంభమైంది. ప్రధాని ప్రత్యేక ‘పగడి’ ధరించి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం విశేషం. గుజరాత్‌లోని జామ్‌నగర్ రాచకుటుంబం ఈ ప్రత్యేక పగడిని మోదీకి బహూకరించింది.  

గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశరాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఐటీఓ, యమునా వంతెన తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్‌లో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో భాతర సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, దేశ  సాంఘిక, ఆర్థిక ప్రగతి ప్రతిబింబించేలా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. 

వివిధ రాష్ట్రాలకు చెందిన 17వ సైనిక పటాలాలు, 9 వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన పటాలాలు, కేంద్ర  పారామిలటరీ బలగాలు, 9 భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బలగాలు గణతంత్ర పరేడ్‌లో పాల్గొనున్నాయి. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. 

 
\