
రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు విస్తరణ పనులను ఎక్కడికక్కడే నిలిపి వేయాలని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసింది. ఈ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారిగా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ డిసెంబర్ 19న తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ మురళీధర్ కృష్ణానదీ యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణానదీ యాజమాన్యం బోర్డు అధికారి హరికేష్ మీనా ఎపికి లేఖరాశారు. రాయలసీమ ఎత్తిపోతలపథకం, పోతిరెడ్డి పాడు విస్తరణ పనుల డిపిఆర్‌లను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించి అన్ని అనుమతులు పొందిన అనంతరమే ప్రాజెక్టులు నిర్మించాలని లేఖలో స్పష్టం చేశారు. డిపిఆర్‌ఆర్‌లను, సిడబ్లూసి పరిశీలించిన అనంతరం ఇతర అనుమతులు కూడా పొంది అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవల్సి ఉంటుందని లేఖలో వివరించింది.
అయితే ఇటీవల ఎపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై సమర్పించిన డిపిఆర్‌లు అసమగ్రంగా ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపిన విషయాన్ని ఈ లేఖలో గుర్తు చేశారు. అలాగే తెలంగాణ చేసిన ఫిర్యాదులో ఉన్న అనేక అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు. ఇప్పటివరకు ఒకసారి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమతిలేకుండానే పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం 80వేల క్యూసెక్కుల నీటిని రోజుకు 7టిఎంసిల చొప్పున ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు ప్రాజెక్టు విస్తరణపనులు చేపట్టిందని ఆరోపించింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయని పక్షంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని తెలంగాణప్రాజెక్టులకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈలేఖను సీరియస్‌గా తీసుకున్న కృష్ణానదీ యాజమాన్యం బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్‌మీనా పోతిరెడ్డి పాడు పనులు నిలిపివేయాలని లేఖరాశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం,పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్ధం పెంపు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఎపికి తెలిపారు. డిపిఆర్‌ల ఆమోదం అనంతరం నిర్మించాలని అప్పటివరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కేంద్రజలశక్తి శాఖ ఎపికి ఘాటుగా చెప్పింది.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు