ఉత్తరాఖండ్ ఒకరోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టి గోస్వామి 

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరిద్వార్ కు చెందిన  ఒక యువతీ వ్యవహరించారు.. ఆ జిల్లా దౌలతాపూర్ గ్రామ నివాసి అయిన శ్రిష్టి గోస్వామి రూర్కెలా బిఎసి (వ్యవసాయం) చదువుతున్నారు. 
 
అనిల్ కపూర్ నటించిన నాయక్ సినిమాలోని ఒక ఊహాజనిత సంఘటనకు వస్తవ రూపమా అన్నట్లు ఆమె ఒకరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించి అరుదైన అవకాశం పొందారు. ఇది కేవలం పేరుకు మాత్రమే ఆమె ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఉత్తరాఖండ్ చరిత్రలో ఒక మహిళా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 
 
ఆమె తండ్రి గ్రామంలో ఒక చిన్న షాప్ నిర్వహిస్తుండగా, ఆమె తల్లి  అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. 19 సంవత్సరాల ఈ యువతీ 2018లో ఉత్తరాఖండ్ మహిళా కమీషన్ నిర్వహించిన బాల విధాన సభలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2019లో బాలికల అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొనడానికి ఆమె థాయిలాండ్ కు వెళ్లారు. 
 
శ్రిష్టి తెలివైన యువతీ అని, బాలికల అభ్యున్నతికోసం ఆరాటపడుతూ ఉంటారని ఆమె తండ్రి ప్రవీణ్ పూరి చెప్పారు. బాలికల అభ్యున్నతికోసం పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థకు ఆమె పనిచేస్తున్నారు. ఒక రోజు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం రావడం పట్ల ఆమె సంతోషం ప్రకటించారు. ఇది నిజమా అని నమ్మలేక పోతున్నానని చెబుతున్నారు. బాలికలు పాలనలో ప్రజల సంక్షేమం కోసం పనిచేయగలరని నిరూపిస్తానని భరోసా వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర రాజధాని డెహ్రాడున్ లోని అసెంబ్లీ హాలులో ఆమె మూడు గంటల పాటు జరిగిన నమూనా అసెంబ్లీకి సారధ్యం వహిస్తూ ఆమె అటల్ ఆయుష్మాన్ పధకం, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, వివిధ శాఖల కార్యక్రమాలను  సమీక్షించారు. ఒకొక్క అధికారి ఐదు నిముషాల సేపు తమ శాఖలో చేబడుతున్న కార్యక్రమాలను  వివరించగా, ఆమె తనకు తోచిన సూచనలు వారికి చేశారు.
 ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్  రావత్ రాష్ట్రంలోని కుమార్తెలు అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ వారంతా ఉజ్వల భవిష్యత్ కలిగి ఉండాలని ఆకాంక్షించారు. వారందరి స్వయం సమృద్ధికి, సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. 
ఈ సందర్భంగా వివిధ రంగాలలో భారత దేశపు కుమార్తెలు సాధిస్తున్న విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. తమ ప్రభుత్వం కూడా వారికి మెరుగైన  వైద్యం, విద్య సదుపాయాల కల్పనకు, లింగ సమానత్వం కోసం విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి పదవి చేపట్టముందు వివిధ ప్రభుత్వ విభాగాల గురించి అధికారులు ఆమెకు వివరించారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ బాలల హక్కుల కమీషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ వ్రాసింది. శ్రేష్టి కొంతకాలంగా తమతో కలసి పనిచేస్తున్నదని, ఆమె సామర్ధ్యాలు తమకు తెలుసని కమీషన్ చైర్ పర్సన్ ఉష నేగి తెలిపారు.