ఏపీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు!

ఏపీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు!
ఆంధ్రప్రదేశ్ లో పవర్‌ గేమ్‌, కుల, మత రాజకీయాలు, గూండాయిజం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని బీజేపీ జాతీయ నాయకుడు రామ్‌మాధవ్‌ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ‘బికాజ్‌ ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ గ్రంథావిష్కరణ సభలో మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, ఏపీలో మాత్రం వాటి సంఖ్య చాలా పరిమితంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 
 
ఇక్కడ మూడు రాజధానుల వివాదం, ఆలయాల కూల్చివేతలు తప్పితే మరొకటి వినిపించడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో అధికార పార్టీ ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆలోచించాలని హితవు చెప్పారు. 
 
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, కొవిడ్‌ కారణంగా స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైంది కాదని స్పష్టం చేశారు. కోర్టులు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. 
 
రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కొంతమంది శాసిస్తున్నారని మండిపడ్డాయిరు. వారి నియంత్రణ నుంచి రైతులను తప్పించడానికే సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వాటికి సహకరించాలని, రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.