ఉద్యోగసంఘ నేత బెదిరింపుపై నిమ్మగడ్డ ఫిర్యాదు 

పంచాయతీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నేరపూరితం గా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కార్యకలాపాలపై నిఘా పె ట్టాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు.
 
‘పంచాయతీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెంకట్రామిరెడ్డి బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ హక్కు కల్పించిందని, దీనికి కొనసాగింపుగా ఎదుట వారిని చంపే హక్కు కూడా కల్పించిందని వ్యాఖ్యానించారు. వీటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా, కమిషనర్‌కు ప్రాణహాని బెదిరింపుగా ఎస్‌ఈసీ పరిగణిస్తోంది” అని ఆ లేఖలో స్పష్టం చేశారు. 
 
అందుచేత డీజీపీ వీటిని పరిగణనలోకి తీసుకుని, కమిషనర్‌పై భౌతిక దాడులకు దారితీసే విధంగా వెంకట్రామిరెడ్డి కార్యకలాపాలు ఉన్నాయేమో నిఘా పెట్టాలని కోరుతోందని అందులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశాక వెంకట్రామిరెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావమున్నందున ఎన్నికలు నిర్వహించరాదని, ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతారని గతంలో కూడా ఆయన పేర్కొన్నారు.
 
కాగా, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పలుకులే ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వమే వారితో ఇష్టానుసారం మాట్లాడిస్తోందని మాజీ ఉద్యోగసంఘ నేత, టిడిపి ఎమ్యెల్సీకి అశోక్ బాబు ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం అనుకొంటే ఆ మాటే కోర్టులో ధైర్యంగా చెప్పి ఉండాల్సింది. దానిబదులు ఉద్యోగ సంఘాల్లో తమ చేతిలో ఉన్నవారితో మాట్లాడించడం ఎందుకు? అని  ప్రశ్నించారు. 
 
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంబ్‌ ఆదేశాలను ధిక్కరించడం కోర్టు ధిక్కరణే అని మాజీ ఆర్ధిక మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారాలకు అడ్డుపడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని అంటూ ఆర్టికల్‌ 356 అమలుకు తానే దోహదం చేస్తున్నారని హెచ్చరించారు.
 
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గవర్నర్‌ కల్పించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు  కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.