అవినీతిపై చర్చకు సిద్ధమా?  సీఎం ఎడప్పాడి సవాల్‌  

డీఎంకే అంటేనే అవినీతిమయం  అని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మీ భూములు మీకే ఉండబోవని, అవన్నీ డీఎంకే నేతల చేతులలోకి మారతాయని  తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి ప్రజలను హెచ్చరించారు. కోయంబత్తూర్ లో రెండు రోజుల ఎన్నికల ప్రచారం `విజయపథం’ యాత్రను ప్రారంభిస్తూ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ 13 మంది డీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఇంకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. 
 
కోవైలో జరిగిన సభలో ఓ మహిళ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్టాలిన్‌, తన పార్టీ నేతలతో సదరు మహిళను బయటకు పంపించివేశారని విమర్శించారు. సభలో మహిళలడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ నేతలదని, అది కూడా స్టాలిన్‌కు తెలియకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్రంలో  డీఎంకే పాలనలోనే అవినీతి జరిగిందని, కానీ వారు ప్రస్తుతం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో చేతుల్లో ఎలాంటి చీటీలు లేకుండా చెప్పాలని, అప్పుడే వాటిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం సవాల్‌ విసిరారు.  
 
దేశం మొత్తం మీద అవినీతి ఆరోపణలపై రద్దయిన ప్రభుత్వం ఏర్పర్చిన ఘనత డీఎంకేకు మాత్రమే ఉన్నాడని గుర్తు చేశారు. అటువంటి పార్టీ గవర్నర్ ను కలసి తమ మంత్రులపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తిరునెల్వేలి-టెంకాసి రోడ్ ప్రాజెక్ట్ లో తాము రూ 450 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించడంపై మండిపడ్డారు. వాస్తవానికి ఆ టెండర్ ను రద్దుచేశామని, తాజాగా టెండర్ పిలువబోతున్నామని చెప్పారు. 
 
 మాజీ ముఖ్య మంత్రి జయలలిత మరణా నంతరం అప్పట్లో తమ పార్టీని విచ్ఛిన్నం చేసి, ప్రభుత్వాన్ని కూల్చేం దుకు డీఎంకే అధ్య క్షుడు స్టాలిన్‌ కుట్రపన్నారని  పళనిస్వామి ధ్వజమెత్తారు. కోవై టౌన్‌హాల్‌ ప్రాంతంలో ఉన్న గోనియమ్మన్‌ ఆలయంలో స్వామిదర్శనం అనంతరం ప్రచారాన్ని ప్రారంభిస్తూ  ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అసత్య ఆరోపణలతో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
 
గ్రామసభల పేరిట ఆమాయకులైన మహిళల్ని రప్పించి, పార్టీ నేతలు రాసిన ప్రశ్నలను వారి చేత చెప్పిస్తూ, అరుగు మీద కూర్చొని వారికి సమాధానాలిస్తూ స్టాలిన్‌ పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాని ప్రతిపక్ష నేతలపై బురదజల్లుతూ కాలం గడపడం లేదని చెబుతూ తాను అభివృద్ధి కార్యకలాపాలపైననే దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏమిటో తాము అమలు జరిపిన కార్యక్రమాలే చెబుతాయని భరోసా వ్యక్తం చేశారు. 
 
“మీరు ఒకసారి 2019లో మోసపోయారు. అత్యధికంగా డీఎంకే సభ్యులను లోక్ సభకు ఎన్నుకున్నప్పటికీ వారు రాష్టానికి ఏమీ చేయలేదు. మరోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మోసపోవద్దు” అంటూ ప్రజలని పళనిస్వామి హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అంటూ తమ ప్రభుత్వ విజయాలను వివరించారు.