రైతు సంఘాల మొండి ధోరణితోనే చర్చలు ఫలించడం లేదు

రైతు సంఘాల మొండి ధోరణితోనే చర్చలు ఫలించడం లేదు
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పట్ల రైతు సంఘాలు అనుసరిస్తున్న మొండి ధోరణి కారణంగానే ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఫలించడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విమర్శించారు.
 
ప్రభుత్వం తరపున ఈ చర్చలలో పాల్గొంటున్న ముగ్గురు మంత్రుల బృందానికి సారధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఒక వార్త ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో : కొత్త సాగు చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సంఘాలు గుర్తించడం లేదని ఆరోపించారు.  కేవలం ఈ చట్టాలను రద్దు చేయాలని మాత్రమే పట్టుబడుతున్నాయని, సాగు చట్టాలను రైతు సంఘాలు విశ్లేషణాత్మకంగా పరిశీలించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని చెప్పారు.
 
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సుమారు రెండు నెలల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 11 సార్లు రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కొన్ని సవరణలను చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, వీటిని పూర్తిగా రద్దు చేయవలసిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. 
 
ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న ఢిల్లీలో రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించబోతున్నాయి.   కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకుందని, విశ్లేషించిందని, ఓ ప్రతిపాదనను పంపించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించకుండా ఉండవలసిందని చెప్పారు. ఈ ప్రతిపాదనలను రైతు సంఘాలు ఆమోదించి ఉంటే, చర్చలు ముందుకు సాగేవని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఆమోదించిందని తోమర్ పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పరిపూర్ణంగా సున్నితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.