అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు  

అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు  
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బైడెన్‌ ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక అదేశాలపై సంతకాలు చేయగా, తాజాగా కరోనా మహమ్మారితో దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
 
1.9 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన ఆదేశంపై సంతకం చేశారు. ‘ది అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుందని వెల్లడించారు. దీంతో అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు (1.46 లక్షలు) జమ కానున్నాయి. 
 
ఈ మొత్తాన్ని ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కరోనా వల్ల అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే 600 డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇవి ఏమాత్రమూ సరిపోవని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అద్దె ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. 
 
అతేకాకుండా ‘ది అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’లో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి, అధిక సమయం పని చేసే వారి కనీస వేతనాల పెంపును ప్రస్తావించారు.  
 
కాగా, అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్‌ జనరల్‌ అస్టిన్‌ నియమితులయ్యారు. అగ్రరాజ్యానికి నల్లజాతీయుడు ఒకరు రక్షణ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌ రక్షణ మంత్రిగా అస్టిన్‌ నామినేషన్‌ను రికార్డు స్థాయిలో 93–2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్‌ టామ్‌ మూయిర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్‌ విధుల్లో చేరారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనపై ఫిబ్రవరి 8నుంచి సెనేట్‌లో విచారణ మొదలు కానుంది. ఈ నెల 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి అరాచకం సృష్టించడమే కాకుండా అయిదు నిండు ప్రాణాలు బలైపోవడానికి పరోక్షంగా కారణమవడంతో ట్రంప్‌పై ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ప్రతినిధుల సభ ఆమోదించడం తెలిసిందే.