తాండవ్‌ వెబ్‌సిరీస్‌ లో వివాదాస్పద అంశాలు తీసేయండి  

తాండవ్‌ వెబ్‌సిరీస్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. వెబ్‌సిరీస్‌లో తమ మతవిశ్వాసాలను దెబ్బతీశారని పలువురు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని మేకర్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఓటీటీ వేదికగా విడుదలైన కంటెంట్‌లో ప్రభుత్వం మార్పులు సూచించడం ఇదే తొలిసారి. ఓటీటీ కంటెంట్‌కు స్వీయ నియంత్రణపై చర్చ జరుగుతున్న సమయంలో తాండవ్‌ వెబ్‌సిరీస్‌ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి.

భావప్రకటన స్వేచ్ఛతో పాటు సున్నితమైన అంశాలను తెరకెక్కించే సమయంలో మేకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై జరిగిన భేటీలో స్పష్టం చేసినట్టు సమాచారం. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో దేశంలో శాంతిభద్రతలకు ఏ ఒక్కరూ విఘాతం కల్పించరాదని స్పష్టం చేసింది. 

ఇక ఓటీటీ కంటెంట్‌ కోసం ప్రత్యేకంగా స్వీయ నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మత విశ్వాసాలను దెబ్బతీశారనే ఫిర్యాదులతో తాండవ్‌ వెబ్‌సిరీస్‌ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌, నిర్మాత హిమాన్షు మెహతా, రచయిత గౌరవ్‌ సోలంకి, నటుడు సైఫ్‌ అలీఖాన్‌లపై దేశవ్యాప్తంగా పలు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. మిర్జాపూర్‌ షోపైనా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.