చంద్రబాబును ఏ–1 నిందితుడిగా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌   

విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి కేసులో తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలపై నేరారోపణలు చేసి, వారిపై కేసులు నమోదు చేశారు.

 రాముని విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ నెల 2న ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం  వచ్చారు. అదే రోజు చంద్రబాబు పర్యటన అప్పటికే ఖరారైంది. చంద్రబాబు కంటే ముందు విజయసాయిరెడ్డి రామతీర్థం వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు విజయసాయిరెడ్డిపై వాటర్‌ ప్యాకెట్లు, చెప్పులు, రాళ్లు రువ్వారు. 

ఈ ఘటనపై విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎ-1గా చంద్రబాబునాయుడు, ఏ-2గా అచ్చెన్నాయుడు, ఎ-3గా కళావెంకటరావు, ఎ-4గా సువ్వాడ రవిశేఖర్‌ పేర్లతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది.   

ఈ నెల 20న కళావెంకటరావు, రవిశేఖర్‌ సహా 8మందిని అరెస్టు చేశారు. కళావెంకట్రావు అరెస్టుతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులన్నీ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తంచేయడంతో పోలీసులు వెనక్కు తగ్గి కళాను 41 నోటీసుతో విడిచి పెట్టారు. రవిశేఖర్‌తో పాటు అరెస్టయిన ఏడుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.

రిమాండ్‌ రిపోర్టులో ఎ-1, ఎ-2, ఎ-3 పేర్ల వద్ద ఖాళీలు ఉంచి ఎ-4 నుంచి రిమాండ్‌ విధించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళావెంకటరావు పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదై ఉన్నందున రిమాండ్‌ వర్తించే అవకాశముంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం వీరిని కూడా నిందితులుగానే గుర్తించే పరిస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.