ఎంపీ‌ ఈ-టెండర్‌ స్కామ్‌లో మంతెన అరెస్ట్ 

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ-టెండర్‌ కుంభకోణం కేసులో హైదరాబాద్‌కు చెందిన మంతెన కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ శ్రీనివాస రాజు మంతెన, అర్ని ఇన్‌ఫ్రాకు చెందిన ఆదిత్య త్రిపాఠి(బిహార్‌)ని హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) విభాగం అధికారులు బుధవారం అరెస్టు చేశారు. 

ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం న్యాయస్థానం ఇద్దరికి ఫిబ్రవరి 3 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సుమారు 3 రూ 3,000 కోట్ల అక్రమాలకు సంబంధించి జరిగిన ఈ-టెండరు స్కామ్‌లో పలు సంస్థలపై కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగం, సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా పెద్దమొత్తంలో నిధులు దారిమళ్లడంతో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 

కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన మంతెన కన్‌స్ట్రక్షన్స్‌ రూ. 1030 కోట్లు అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్‌లోని మంతెన కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వారంరోజులపాటు తనిఖీలు నిర్వహించింది. 

తనిఖీల్లో సాంకేతిక ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. వాటిని విశ్లేషించిన అనంతరం తమవద్ద ఉన్న ఆధారాల మేరకు శ్రీనివాసరాజు, ఆదిత్య త్రిపాఠిని అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస రాజు, ఆదిత్య త్రిపాఠి, పలువురు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, ఐటీ సర్వీ్‌సతో కలిసి ఈ-టెండర్స్‌లో అక్రమాలకు పాల్పడి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఈడీ అధికారులు ఆధారాలను సేకరించారు.  

మధ్యప్రదేశ్‌లో 2018 మొదటి త్రైమాసికంలో పలు అభివృద్ది పనులకు అక్కడి ప్రభుత్వం ఈ-టెండర్లు స్వీకరించింది. ఈ-టెండర్లు స్వీకరించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌ను హ్యాక్‌ చేసి ఇతర సంస్థలు ఎంత మొత్తానికి టెండరు దాఖలు చేసింది గుర్తించి వారికంటే తక్కువ మొత్తానికి  టెండరు వేసి పలు సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. 

2019లో విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ-టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డ సంస్థల్లో  కొన్ని హైదరాబాద్‌కు చెందినవి కూడా ఉన్నాయి.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ ఈడీ విభాగం మరికొందరిని విచారించి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.