ధార్మిక సంస్థలను హిందువులే పరిరక్షించుకోవాలి

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలిందు పరాండే ఖండించారు. గురువారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధార్మిక సంస్థలు, నిర్వాహకులపై ప్రభుత్వ అరెస్టులు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ధార్మిక సంస్థల పరిరక్షణను హిందువులే పరిరక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే వారెవరైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పని లేకుండా ధార్మిక సంస్థలను మేమే సంఘటితంగా కాపాడుకుంటామని పరాండే స్పష్టం చేశారు. 
 
కాగా,  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ముసుగేసుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కులాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రను చేపట్టారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పార్టీకి చెందిన నేతలందరూ తప్పకుండా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాలపై దాడులను హైలైట్ చేస్తూనే.. ఏడాదిన్నర వైసీపీ పాలనను ఎండగట్టాలని నేతలకు సూచించారు.