బైక్ అంబులెన్స్ రూపొందించిన డిఆర్డిఓ 

దేశ రక్షణ కోసం ఆయుధాలు రూపొందించే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) ప్రజోపకరమైన ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా డిఆర్డిఓ  పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు. సీఆర్‌పిఎఫ్, డిఆర్డిఓ కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ “రక్షిత”ను ప్రారంభించారు. ఈ బైక్ అంబులెన్స్ ను మావోయిస్టు ప్రభావిత అటవీప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ వినియోగించేందుకు అనువుగా మలిచారు.

డిఆర్‌డిఓకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ 350 సిసి రాయల్ ఎన్‌ఫీల్ట్ క్లాసిక్ బైకులను అంబులెన్సులుగాడిజైన్ చేసింది. రక్షిత అంబులెన్సులుగా వ్యవహరించే 21 బైక్ అంబులెన్సులను సిఆర్‌పిఎఫ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.  ఈ ప్రాజెక్టు కోసం సిఆర్‌పిఎఫ్ రూ. 35.49 లక్షల నిధిని ప్రాథమికంగా మంజూరు చేసింది.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, తిరుగుబాటు తాకిడికి గురయ్యే ప్రాంతాలలో ఘర్షణల సందర్భంగా గాయపడే పారామిలిటరీ సిబ్బందిని ఆసుపత్రులకు తరలించేందుకు ఈ బైక్ అంబులెన్సులను ఉపయోగిస్తామని సిఆర్‌పిఫ్ అధిపతి ఎపి మహేశ్వరి తెలిపారు. సిఆర్‌పిఎఫ్ బలగాలు మోహిరించి ఉన్న ప్రాంతాలలో స్థానికులకు కూడా ఇవి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెనుక సీటులో తరలించే సమయంలో వారికి అవసరమైన ఆక్సిజన్ కిట్, స్లైన్ సౌకర్యం అందుబాటులో ఉండేలా పరికరాలు అమర్చారు.

ఈ బైక్‌లు బీజాపూర్, సుక్మా, దంతేవాడ మొదలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే, పెద్ద అంబులెన్స్‌లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదని  సీఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. ఇటువంటి బైక్‌లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు చెప్పారు.

ముఖ్యంగా నక్సలైట్ జోన్లలో ఇరుకైన రోడ్లలో వేగంగా చేరుకోవడానికి  సీఆర్‌పిఎఫ్ దళాలు  గమనించిన తర్వాత ఈ బైక్ అభివృద్ధి చేసారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసింది.