ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఆలయాలపై దాడులు  

 ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఆలయాలపై దాడులు  

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే దాడులు పెరిగాయని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంపై గుంటూరులో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆలయాలపై దాడులను ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సాహించిందని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసి సాదా సీదా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 

విదేశీ నిధులతో ప్రవీణ్ చేస్తున్న మత మార్పిడిల గురించి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఆతని వెనుక ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిజమైన దోషులను పట్టుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన బీజేపీ వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పుల వల్లే ఇపుడు ఆలయాల దాడుల విషయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పాస్టర్ల సంఖ్య ఎంత? ప్రభుత్వం ఎంతమందికి సహాయం చేస్తోంది? వాస్తవాలు నిగ్గు తేల్చాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

సత్తెనపల్లి బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేసి.. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని జివిఎల్ మండిపడ్డాయరు. బీజేపీ తలపెట్టిన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హిందూ మతంపై దాడులను ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని జీవీఎల్ మరోసారి ఆరోపించారు.