తిరుపతిలో గెలుపు కోసం బిజెపి ఎత్తుగడ   

తిరుపతి లోక్ సభ నియోజకవర్గంకు త్వరలో జరిగే ఉపఎన్నికలలో ఏమైనా సరే గెలుపొంది రాష్ట్రంలో తమ సత్తా చాటాలని నిర్ణయించారు.  అందుకు వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రణాలికను రూపొందించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలి’’ అని ఆ పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. 
 
విశాఖ శివారు రుషికొండలో జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మురళీధరన్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, యూ జాతీయ సునీల్‌ దేవధర్‌,  సత్యకుమార్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

‘‘తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలి. కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలి’’ అని నిర్ణయించారు. వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర  చేపట్టాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ జరగాలని  ఈ సందర్భంగా ప్రణాలికను రూపొందించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రకటించిన ఏ పథకాన్ని సజావుగా అమలు చేయడం లేదని, ప్రకటనలతో భ్రమింపజేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా చేస్తున్న ఎదురుదాడిని సమర్థంగా తిప్పి కొట్టాలని, ప్రజల్లోకి పార్టీ వాదనలు బలంగా తీసుకెళ్లాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి తటస్థంగా ఉన్న మాజీ నాయకులు, అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటున్న నేతలను సంప్రతించి, బీజేపీలోకి తీసుకురావాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది.