వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు వాయిదా

కొత్త ప్రైవసీ విధానం అప్‌డేట్‌పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉండడంతో వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. అప్‌డేట్‌ అమలును కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో  వినియోగదారులు పాలసీపై సమీక్షించుకునేందుకు మరింత సమయం ఉపయోగపడుతుందని పేర్కొంది.
తమ పాలసీపై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, ఈ మేరకు ప్రైవసీ పాలనీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మొదట నిర్ణయించిన మేరకు ఫిబ్రవరి 8న కాకుండా పాలసీని మే 15 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిపివేయడం, తొలగించడం లేదని చెప్పింది. తమ యాప్‌లో గోప్యత, భద్రత, పని విధానంపై వచ్చిన అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పింది.  కొత్త ప్రైవ‌సీ పాల‌సీలో భాగంగా యూజ‌ర్ల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని వాట్సాప్ ప్రకటించింది.
అయితే ఈ డేటా ఏంటి?  మీ నుంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా సేక‌రించే డేటా మొత్తం ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతుంది. ఇందులో మీ మొబైల్ నంబ‌ర్‌, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకునే స‌మ‌యంలో మీరు ఇచ్చే క‌నీస స‌మాచారం ఉంటుంది.
అంతేకాకుండా యూజ‌ర్ యాక్టివిటీ, వాట్సాప్ ఎంత త‌ర‌చుగా వాడుతున్నారు. వినియోగించే ఫీచ‌ర్లు, ప్రొఫైల్ ఫొటో, స్టేట‌స్‌, అబౌట్ స‌మాచారం అంతా వాట్సాప్ సేక‌రిస్తుంది. మీ డివైస్ నుంచి మీ క‌చ్చిత‌మైన లొకేష‌న్‌ను కూడా మీ అనుమ‌తితో సేక‌రిస్తుంది. ఈ స‌మ‌చారాన్నంతా ఫేస్‌బుక్‌, దాని ఇత‌ర ప్రోడ‌క్ట్స్ కూడా ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది.
 ఇందులో ఫేస్‌బుక్‌తోపాటు మెసెంజ‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ షాప్స్‌, స్పార్క్ ఏఆర్ స్టూడియో, ఆడియెన్స్ నెట్‌వ‌ర్క్‌లాంటివి ఉన్నాయి. ఈ కొత్త పాలసీ విధానంపై యూజర్ల వ్యక్తిగత సమాచారం, పేమెంట్ లావాదేవీలు, కాంటాక్ట్‌లు, లొకేష‌న్‌తోపాటు ఇత‌ర కీల‌క స‌మాచారాన్ని వాట్సాప్ సేక‌రించి త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందించ‌నుంది. దీంతో యూజర్ల డేటా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. వాట్సాప్‌ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా యూజర్లు మండిపడుతున్నారు. పలువురు వాట్సాప్‌ను వీడి ప్రత్యామ్నాయ యాప్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇలా ఉండగా,  వాట్సాప్‌ ఇటీవల తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. పలు వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులు.. యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటారనే ఆరోపణలపై కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకు వాట్సా్‌పను ఎలాంటి వివరణ అడగకున్నా  త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.