ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా నిర్మాణ కార్యక్రమం ఆరంభం అయింది. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని శుక్రవారం చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెలరోజుల క్రితం పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2022లో అంటే వచ్చే ఏడాది దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఉంటాయి. ఈ లోగానే పార్లమెంట్ కొత్త భవన రూపకల్పన జరగాలని తలపెట్టారు.
త్రికోణాకృతిలో వెలుపల, లోపల పలు ప్రత్యేకతలతో కొత్త భవనం భవిష్యత్తు చట్టసభల కార్యకలాపాల నిర్వహణ అవసరాలు తీర్చేదిగా ఉంటుంది. 2022 వర్షాకాల సమావేశాలను కొత్త పార్లమెంట్‌లోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పార్లమెంట్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. శుక్రవారం పనులు ఆరంభం అయినట్లు నిర్థారించారు.
తగు సంఖ్యలో కూలీలను రంగంలోకి దింపారు. ప్రధాని మోదీ డిసెంబర్ 10వ తేదీన భూమిపూజ జరిపారు. ఈ వారం ఆరంభంలోనే 14 మంది సభ్యుల హెరిటేజ్ ప్యానల్ ఈ ప్రాంతాన్ని సందర్శించింది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, దీనితో పాటు సెంట్రల్ విస్టా పనులకు పచ్చజెండా చూపింది.
టాటా ప్రాజెక్టు లిమిటెడ్ వారికి నిర్మాణ బాధ్యతలు దక్కాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ సంస్థ రూ 971 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మిస్తోంది. పనుల ఆరంభంలో 35 రోజుల ఆలస్యం జరిగినప్పటికీ , సకాలంలోనే వీలయితే గడువుకు ముందే భవన నిర్మాణం అయి తీరుతుందని టాటా సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.
94 సంవత్సరాల క్రితం రూ 83 లక్షలతో నిర్మించిన ఇప్పటి పార్లమెంట్ భవనం ఇకపై మ్యూజియంగా మారుతుంది. రాజ్యాంగ నిర్మాతల ప్రతీకగా నిలిచిన ఈ భవనం చరిత్రలో ఓ పుట కానుంది. ఇప్పుడు రూపొందే కొత్త భవనం ఇప్పటి పార్లమెంట్‌కు అభిముఖంగా ఉంటుంది.
లోక్‌సభ, రాజ్యసభ హాల్స్ విశాలంగా ఉంటాయి. దిగువ సభలో 888 మంది సభ్యులు, ఎగువ సభలో 384 మంది సభ్యులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సభలలో ఓటింగ్ ప్రక్రియను సరళీకృతం చేసే వ్యవస్థతో, తెరపై అవసరం అయినప్పుడు గ్రాఫికల్ చిత్రాల ప్రదర్శనకు వీలుగా సకల సన్నాహాలు చేస్తారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ
కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!