సమృద్ధ భారత్ కార్యక్రమంలో పెద్ద ముందడుగు  

స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమంలో పెద్ద ముందడుగు పడిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 83 ఎల్‌సీఏ తేజస్‌ యుద్ధ విమానాలను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప ముందడుగు అని తెలిపారు. దీంతో 50 వేల ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రూ.50 వేల కోట్ల విలువైన 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో గొప్ప ముందడుగు అని చెప్పారు. 500 ఎంఎస్ఎంఈలు, టాటా, ఎల్ అండ్ టీ, వెమ్-టెక్ వంటి ప్రైవేటు కంపెనీలు భాగస్వాములు కావడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారానికి నిదర్శనమని తెలిపారు. 

స్వాతంత్ర్యానంతరం మన దేశం సాంఘిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి కల్పన, పరిశోధన, అభివృద్ధి వంటివాటిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనదని వివరించారు. 

స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల అనేక విధానపరమైన మార్పులు చేసిందని రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం, రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలు విధానం వంటివాటిలో చాలా మార్పులను తీసుకొచ్చామని చెప్పారు. 

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం 83 ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రూ.48 వేల కోట్లతో ఈ విమానాలను సేకరిస్తారు. ఇది అతి పెద్ద దేశీయ రక్షణ ఒప్పందం కావడం విశేషం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందంపై మరికొద్ది రోజుల్లో సంతకాలు జరుగుతాయి. 

ఈ ఒప్పందం మన దేశ రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో గొప్ప మార్పును తీసుకొస్తుందని రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు.