30 వ్యక్తిగత రుణ యాప్‌లను తొలగించిన గూగుల్ 

ఆర్‌బిఐ నిబంధనలను పాటించని వ్యక్తిగత రుణ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించినట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రుణ యాప్‌లతో ప్రజలు పడుతున్న అవస్థలను దృష్టిలోపెట్టుకుని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చర్యలు చేపట్టింది. 

ఆర్‌బిఐ నిబంధనలు ఉల్లంఘించే డిజిటల్ యాప్‌లను పరీక్షించేందుకు రిజర్వు బ్యాంక్ ఇటీవల వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈమేరకు గూగుల్ స్పందిస్తూ సుమారు 30 వ్యక్తిగత రుణ యాప్‌లను ప్లేస్టోర్ నుండి తొలగించింది. 

ఈ యాప్‌లు వినియోగదారుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో పాటు యూజర్ల డేటాను దెబ్బతిస్తున్నాయని, వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రధానమని గూగుల్ తెలిపింది. అయితే ఈ యాప్‌లు వేరే ప్లాట్‌ఫాం నుండి ఇన్‌స్టాల్ చేస్తే, డేటా భద్రతకు తాము బాధ్యత వహించమని గూగుల్ తెలిపింది.

గూగుల్ తొలగించిన యాప్‌ల జాబితాను విడుదల చేయలేదు.  కానీ సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతోంది. దీనిలో 453 యాప్‌లు ఉండగా, అవి ప్లేస్టోర్‌లో కూడా ఓపెన్ కావడం లేదు. గూగుల్ విధానం ప్రకారం, వ్యక్తిగత రుణ యాప్‌లు వినియోగదారులకు అన్ని రకాల సమాచారాన్ని ఇవ్వాలి.

ఉదాహరణకు, రుణాల చెల్లింపు కోసం కనిష్ట, గరిష్ట కాలపరిమితి ఏమిటి? గరిష్ట వడ్డీ రేట్లు ఏమిటి? రుణ మొత్తం ఖర్చు ఎంత ఉంటుందో తెలియజేయాలి. ఫీజులు, రిస్క్, ప్రయోజనాల గురించి పారదర్శకత వహిస్తే ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ జాబితాలో భారత్ ఇన్‌స్టంట్ లోన్ అనే యాప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ యాప్ ఇప్పటికీ గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. రుణ యాప్‌లను సమీక్షించడం కొనసాగిస్తామని గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. వినియోగదారుల భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించే యాప్‌లను వెంటనే తొలిగిస్తామని, యాప్‌లను తొలగించడానికి ముందు నోటీసు ఇవ్వబోమని గూగుల్ పేర్కొంది.