కోవాగ్జిన్‌  వికటిస్తే  భారత్‌ బయోటెక్‌ నష్టపరిహారం 

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్‌ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్‌ వేస్తారు. కానీ, కోవాగ్జిన్‌ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. షరతులు, నిబంధనలు ఈ పత్రంలో ఉంటాయి. 

ఒకవేళ కోవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా, అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా  సదరు వ్యక్తికి వైద్య ఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్‌ బయోటెక్‌ చెల్లిస్తుంది. ఈ పరిహారాన్ని ఐసిఎంఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఎథిక్స్‌ కమిటీ నిర్ణయిస్తుంది.

కోవాగ్జిన్‌ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్న నాటి నుండి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది.  

కాగా, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసుకుా రెండో డోసుకు మధ్య 6 లేదా 8 వారాల విరామం ఉత్తమమని సీరమ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేష్‌ జాదవ్‌ తెలిపారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే డోసుల మధ్య 28 రోజులకుపైగా విరామం ఉన్న పక్షంలో దీని సామర్థ్యం పెరుగుతుందని సీరమ్‌ సంస్థ సిఇఒ ఆదార్‌ పూనావాలా తెలిపారు.

ఈ విషయమై సురేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. కొన్ని వారాల పాటు ఈ గ్యాప్‌ పెరిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. నాలుగు వారాల గ్యాప్‌ ఉన్నా మంచిదేనని, లేదా 6 లేక 8 లేదా 10 వారాలు విరామం మరీ మంచిదని వివరించారు. ఫేజ్‌-3లో క్లినికల్‌ ట్రయల్స్‌ను 28 రోజుల గ్యాప్‌తో నిర్వహించామన్నారు. రెండు డోసులు త్వరగా తీసుకుంటే దీన్ని తీసుకున్నవారికి 70 శాతం ప్రొటెక్షన్‌ ఉంటుందని, ఎక్కువకాలం రక్షణ పొందాలనుకుంటే 6 నుంచి 8 వారాల తరువాత మరో డోసు తీసుకుంటే ఇంకా మంచిదని పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్నవారు కూడా వాక్సిన్‌ తీసుకోవలసిందేనని తెలిపారు. కొందరికి రెండుసార్లు ఈ మహమ్మారి సంక్రమించడమే ఇందుకు కారణమన్నారు. రెండు టీకా మందులనూ మిశ్రమం చేయరాదని, ప్రతి డోసు డిఫరెంట్‌ వ్యాక్సిన్‌ నుంచి వచ్చిందని తెలిపారు.