కోవిడ్ వ్యాక్సిన్‌లు  ‘సంజీవని’

కోవిడ్ మహమ్మారిపై జరుపుతున్న వ్యతిరేక పోరాటంలో దేశీయంగా తయారు చేసిన రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లను ‘సంజీవని’గా కేంద్ర హోం మంత్రి హర్షవర్ధన్ అభివర్ణించారు. వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ప్రజలు లేనిపోని మాటలు వినకుండా నిపుణులు, భారతీయ శాస్త్రవేత్తలపై నమ్మకం ఉంచాలని కోరారు.

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ హర్షవర్దన్ సమక్షంలో జరిగింది. దీనికి ముందు, వర్చువల్ ప్రసంగం ద్వారా దేశవ్యా.ప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ఉదయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఇది ఒక చారిత్రకమైన రోజు అని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కోవిడ్‌పై జరిపిన పోరాటం మనందరికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి భారీ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ప్రారంభం కావడం అభినందనీయమని కొనియాడారు.

కోవిడ్‌పై పోరాటంలో అహరహం శ్రమించిన వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, పాత్రికేయులకు అభినందనలు  తెలిపారు. భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు వ్యాక్సిన్‌లు పూర్తి సురక్షితమని, సమర్ధవంతంగా పనిచేస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ సమర్ధతపై శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.  గత ఏడాదిగా కరోనా మహమ్మారిపై మడంతిప్పని పోరాటం చేశామని, ముందస్తు చర్చలు, ప్రోయాక్టివ్ వ్యూహంతో ముందుకెళ్లి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యల్ప మరణాలు చోటుచేసుకున్న ఘనత  భారత్ దే అని హర్షవర్ధన్ తెలిపారు.