ఉచితంగా 16.5 ల‌క్ష‌ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు

భార‌త్ బ‌యోటెక్ 16.5 ల‌క్ష‌ల కొవాగ్జిన్ వ్యాక్సిన్ల‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ త‌న వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.295కు ప్ర‌భుత్వానికి అమ్ముతోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆరోగ్యశాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. 
 
16.5 ల‌క్ష‌ల డోసులు ఉచితంగా ఇచ్చిన త‌ర్వాత మ‌రో 38.5 ల‌క్ష‌ల డోసులు ఒక్కోదానికి రూ.295 వ‌సూలు చేస్తోంద‌ని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఆ లెక్క‌న మొత్తం 55 ల‌క్ష‌ల డోసుల‌కు తీసుకుంటే  ఒక్కో డోసు ఖరీదు రూ.206 మాత్ర‌మే అవుతుంద‌ని తెలిపింది. 
 
ఈ నెల 14లోపు 100 శాతం వ్యాక్సిన్ డోసులు అంద‌నున్న‌ట్లు చెప్పింది. అంటే సీర‌మ్ నుంచి 55 ల‌క్ష‌ల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు, భార‌త్ బ‌యోటెక్ నుంచి 55 ల‌క్ష‌ల కొవాగ్జిన్లు క‌లిపి మొత్తం కోటి 10 ల‌క్ష‌ల డోసులు రానున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.   
 
ఇలా ఉండగా, దేశీయంగా త‌యారైన కొవిడ్ టీకాల‌ను భార‌త్ త్వ‌ర‌లోనే విదేశాలకు ఎగుమ‌తి చేయ‌నుంద‌ని విదేశాంగ మంత్రి జై శంక‌ర్ తెలిపారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతుల‌పై కొన్ని వారాల్లో స్ప‌ష్ట‌త రానుంద‌ని ఆయ‌న చెప్పారు. వ్యాక్సిన్‌ల‌‌ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. 
 
త‌మ దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్‌ అర్థం చేసుకుందని జైశంక‌ర్ వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్‌లను వినియోగించాలనే దానిపై త్వరలోనే ఒక అవ‌గాహ‌న‌ వస్తుందని, అనంతరం ఎగుమతులు ఎంతమేర‌కు చేయాల‌నే విష‌యంలో క్లారిటీ రానుంద‌ని చెప్పారు.