ట్రంప్ పై డెమొక్రాట్ల అవిశ్వాసం 

జో బైడెన్ ఎన్నిక‌ను తిప్పికొట్టేందుకు చివ‌రి వ‌ర‌కు విఫల ప్రయత్నం చేసిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముందే ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం అవుతున్న‌ది. ఆయ‌న‌ను అభిశంసిస్తూ  చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల స‌భ‌లో డెమోక్రాట్లు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి ట్రంప్ సొంత పార్టీ రిప‌బ్లిక‌న్ పార్టీ స‌భ్యులు కూడా మ‌ద్ద‌తు తెలుపుతుండ‌టం గమనార్హం.
అమెరికా క్యాపిట‌ల్ భ‌వ‌నంపైకి త‌న మ‌ద్ద‌తుదారులు దాడి చేసేలా ట్రంప్ ప్రోత్స‌హించార‌ని ఆరోపిస్తూ డెమోక్రాట్ నేత డేవిడ్ సిసిలీన్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి 185 మంది స‌భ్యులు మ‌ద్ద‌తు తెలిపారు. బుధ‌వారం దీనిపై ఓటింగ్ జరిగిన మీద‌ట సెనెట్ ఆమోదానికి పంపుతారు.
అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ఎన్నిక‌ను ధ్రువీక‌రించేందుకు అమెరికా కాంగ్రెస్ ఈ నెల ఆరో తేదీన స‌మావేశ‌మైంది. ఈ అంశాన్ని వ్య‌తిరేకిస్తూ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు క్యాపిట‌ల్ భ‌వ‌నాన్ని ముట్ట‌డించి దాడి చేశారు. దీంతో పోలీసుల‌కు, ట్రంప్ మ‌ద్ద‌తు దారుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో న‌లుగురు మ‌ర‌ణించారు.
 ట్రంప్ త‌న మ‌ద్ద‌తుదారుల‌ను ప్రోత్స‌హించార‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ట్రంప్ ట్వీట్లు, పోస్టుల‌పై ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌లు శాశ్వ‌తంగా నిషేధం విధించాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ముందే ఇంటికి సాగ‌నంపేందుకు డెమోక్రాట్లు అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.
ఒక‌వేళ తీర్మానం నెగ్గితే ప‌ద‌వీకాలానికి ముందే అవ‌మాన‌క‌ర రీతిలో ట్రంప్.. శ్వేత‌సౌధాన్ని వీడాల్సి రావొచ్చు. మరోవంక, 
సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ట్రంప్‌ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను నిలిపివేస్తూ షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్‌ అధికారిక ఖాతాను శాశ్వాతంగా నిషేధించిన విషయం తెలిసిందే.