నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక  

భారత్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గర్, బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 59 శాతం యాక్టివ్ కేసులు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. 

ఈ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. ఆ రాష్ట్రాల అధికారులు ప్రజలంతా ఫేస్‌ మాస్క్‌లు, భౌతిక దూరం పాటించేలా చూడాలని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. 

మ్యూటేటెడ్‌ స్ట్రైన్‌ ఆఫ్‌ వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా నమూనా పరీక్షలను తగ్గించవద్దని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలు రూపొందించిన ‘టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌’ విధానాన్ని దూకుడుగా అమలు చేయాలని పేర్కొన్నారు. 

పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనాపై పోరు కొనసాగించాల్సిందేనని కేరళ, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ హెచ్చరించారు.  జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు తప్పదనే హెచ్చరికకు ఇదో సంకేతమని చెబుతూ  కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించడం మరిచిపోవద్దని హితవు చెప్పారు. 

మహారాష్ట్రలో సుమారు 52వేల యాక్టివ్‌ కేసులు ఉండగా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో సుమారు 9వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేరళలో గత వారం రోజులుగా 5వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 3700, చత్తీస్‌గఢ్‌లో సగటున 1106, పశ్చిమ బెంగాల్‌లో 908 కొత్త కేసులు రికార్డవుతున్నాయి.