82కు పెరిగిన కోవిడ్ స్ట్రెయిన్ కేసులు

భారతదేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య శుక్రవారానికి 82కు చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈనెల 6వ తేదీ వరకూ ఈ కేసుల సంఖ్య 73 వరకూ ఉన్నాయి. స్ట్రెయిన్ బారిన పడిన వారందరికీ కరోనా పాజిటివ్‌ రావడంతో వీరిని సంబంధిత రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్లలో ఉంచినట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
వారితో సన్నిహిత సంబధాలున్న వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్సర్‌సైజ్‌ కూడా జరుపుతున్నట్టు పేర్కొంది. 
కాగా, పరిస్థితిని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిఘా పెంపు, వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, పరీక్షలు, ఇన్సాకాగ్ లేబొరేటరీలకు శాంపుల్స్ పంపడంపై తగిన సూచనలు ఇస్తున్నట్టు ఆరోగ్య శాఖ వివరించింది. 
 
డెన్మార్క్, నెదర్‌ల్యాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్‌లో కూడా స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
కాగా, బ్రిటన్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఐజీఐ) చేరుకునే ప్రయాణికులకు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఢిల్లీ సర్కార్ మరింత కట్టుదిట్టం చేసింది. యూకే నుంచి ఐజీఐ వచ్చే ప్రయాణికులకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ  ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో తెలిపారు.