ఐసీయూలో మంటలు.. పది మంది శిశువుల మృతి

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో మంటలు చెలరేగి పది మంది నవజాత శిశువులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన భండారా జిల్లా జనరల్‌ హాస్పిటల్‌లో జరిగింది. 
 
సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ) శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్‌ సివిల్‌ సర్జన్‌ ప్రమోద్‌ ఖండతే తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్‌ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించింది. ఆ తర్వాత ఆమె వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
 
భండారా జిల్లా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది శిశువులు మృతి చెందడం నా హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ట్వీట్ చేశారు. పదిమంది నవజాత శిశువులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మోదీ సంతాపం తెలిపారు.
 
ఈ దుర్ఘటన హృదయ విదారక విషాదమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెల, మూడు నెలల వయసు మధ్యలో ఉన్న శిశువులు ఊపిరి ఆడక మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ‘‘మేం విలువైన శిశువులను కోల్పోయాం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని మోదీ తెలిపారు.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.  ఈ  ఘటన విషాదకరమైందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ తెలుపుతూ బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.