ఆరేండ్లలో 630 జూనియర్ కాలేజీలు మూసివేత 

తమ ప్రభుత్వం  కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తుందని, కార్పొరేట్ కళాశాలల భారతం పడుతుందని అధికారమలోకి రాకముందు భారీ వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆచరణలో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలను పెద్ద ఎత్తున మూసి వేస్తూ, కార్పొరేట్ కళాశాలలకు ఎర్రతివాసీ పరుస్తున్నారు. 
 
గత ఆరేళ్లలో తెలంగాణలో 600 ప్రైవేట్ బడ్జెట్ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలల ధాటికి తట్టుకోలేక మూసి వేయడం చూస్తే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రత వెల్లడవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అడ్మిషన్లు రాక, నిర్వహణ కష్టమైపోవడంతో మేనేజ్మెంట్లు కాలేజీలు మూసేస్తున్నాయి. 
 
మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతు​లు రాకపోవడంతో, పాత కాలేజీలను కార్పొరేట్ కాలేజీలు కొని, నిబంధనలకు విరుద్ధంగా నాగరాలలోకి బదిలీ చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఈసారి 1,540 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్​కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇప్పటివరకు1,466 కాలేజీలకే అనుమతి ఇవ్వగా, మరో 74 కాలేజీల అఫిలియేషన్స్ పక్రియ జరుగుతున్నది. ఈసారి123 కాలేజీలు మూతపడ్డాయి. ఏటా ఫీజు కట్టీ అఫిలియేషన్​కు దరఖాస్తు చేసుకునే కాలేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇందుకు అడ్మిషన్లు రాకపోవడం, సరైన వసతులు లేక మేనేజ్మెంట్లే మూసివేసుకోవడం కారణంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో విస్తరిస్తున్న కార్పొరేట్ కాలేజీల ప్రభావం చిన్న కాలేజీలపై తీవ్రంగా పడుతోంది. అలాగే ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో ఇంటర్ అప్ గ్రేడేషన్​కు భారీగా అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గి, నిర్వహణ భారమవుతోంది. చివరకు కాలేజీలు మూసివేయక తప్పడంలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.