కేవలం హిందూ దేవాలయాలపైనే దాడులా!

కేవలం హిందూ దేవాలయాలపైనే రాష్ట్రంలో దాడులు జరగడం ఏంటని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపైనే దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మతిస్థిమితం లేని వారి పని అంటూ సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి  పేర్కొనడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు.  వారికి ఇతర మతాలు కనపడటం లేదా అని నిలదీశారు. 

హిందూ దేవాలయాలపైననే దాడులు జరగడమనేది కరోనాలా ఇదేమైనా కొత్త జబ్బా.. అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 122 చోట్ల ఆలయాల్లో దాడులు జరిగాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే జగన్ సర్కార్‌‌పై మాట్లాడాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే.. నిందితులను పట్టుకోకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 హిందూ ధర్మం లేకుండా చేద్దామని అరాచకశక్తులు అనుకుంటున్నాయని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. తాను హిందువునని, తన ఆలోచనలు సాంస్కృతికంగా ఉంటాయని చెబుతూ  తాను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి.. తన వస్త్రధారణ సంప్రదాయంగా ఉండదని చెప్పుకొచ్చారు. 

నుదుటన అంత పెద్ద బొట్టు పెట్టుకొంటేనే హిందువు కాదని ఆమె హితవు చెప్పారు. మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దని, దేవాలయాలపై దాడులు ఆపాలని ఆమె కోరారు. మహిళలు, ఆలయాల జోలికెళితే పుట్టగతులు ఉండవని ఆమె హెచ్చరించారు. 

ఈ విధ్వంసకాండ ద్వారా హిందువుల మనోభావాల దెబ్బతింటున్నాయని ఆమె వాపోయారు. ‘హిందువులూ మేల్కోండి. ఎంత గళమెత్తితే అంతగా ఈ ఉద్యమం ముందుకు వెళుతుంది. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఎంతో మంది దిగి వచ్చేలా చేసింది’ అని ఆమె పేర్కొన్నారు.