
ప్రధాని నరేంద్రమోదీ కొచ్చి-మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. కేరళలోని కొచ్చి నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు మొత్తం 450 కిలోమీటర్ల పొడవున ఈ న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
కొచ్చి-మంగళూరు మధ్య నిర్మించిన న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం తనకు ఎంతో గర్వంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇది దేశానికి ఎంతో ముఖ్యమైన రోజు అని ప్రత్యేకించి కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు చాలా ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు.
గతంలో కొన్ని దశాబ్దాలుగా దేశం ఏ మేరకు అభివృద్ధి చెందినది అనే విషయంలో తానేమీ మాట్లాడదలుచుకోలేదని, కానీ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ.3,000 కోట్లు వ్యయం చేశారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ పైప్‌లైన్‌ను నిర్మించింది. ఈ గ్యాస్ పైప్‌లైన్ రోజుకు 12 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్‌ను సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉన్నది.
సహజ వాయువును ఉపయోగించడం వల్ల అనేక పర్యావరణ సంబంధిత ప్రయోజనాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. భారత దేశ ఎనర్జీ బాస్కెట్‌లో సహజ వాయువు వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు తగిన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. చమురు, సహజ వాయువు రంగంలో ఈ దశాబ్దంలోనే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా వంట గ్యాస్ దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలకు చేరుతోందన్నారు. ఎల్‌పీజీ సంబంధిత మౌలిక సదుపాయాలు పటిష్టమైనట్లు తెలిపారు.
కొచ్చిలోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రీ గ్యాసిఫికేషన్ టెర్మినల్ నుంచి ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజిక్కోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల మీదుగా మంగళూరు వరకు ఈ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరయ్యారు.
More Stories
ఆధార్‌పై మూడీస్ ఆరోపణలు నిరాధారం
గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ ఆస్తుల స్వాధీనం