బ్రిటన్ ప్రధాని జాన్సన్ భారత్ పర్యటన రద్దు

బ్రిటన్ ప్రధాని జాన్సన్ భారత్ పర్యటన రద్దు

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత దేశ పర్యటన రద్దయింది. స్వదేశంలో కోవిడ్-19 మహమ్మారి కట్టడికి చర్యలను పర్యవేక్షించవలసిన అవసరం ఉండటంతో ఆయన తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.

మన దేశ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 26న జరిగే కార్యక్రమాలకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకావలసి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన యథాతథంగా జరుగుతుందని కొద్ది సేపటి క్రితం వరకు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ పర్యటన రద్దయినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. 

డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగా గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా తాను హాజరు కాలేకపోతున్నట్లు చెప్తూ, అందుకు విచారం వ్యక్తం చేశారు.  

గడచిన రాత్రి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినందువల్ల, కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నందువల్ల తాను బ్రిటన్‌లోనే ఉండవలసిన అవసరం ఉందని, ఈ వైరస్ నివారణకు దేశీయంగా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించవలసి ఉందని చెప్పినట్లు సమాచారం. 

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఇరువురు తమ నిబద్ధతను, అంకితభావాన్ని పునరుద్ఘాటించారని, ఉభయ దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందించే కృషిని కొనసాగించాలని నిర్ణయించారని ఆ వార్తా సంస్థ తెలిపింది. 

కోవిడ్-19 మహమ్మారి విషయంలో కూడా పరస్సరం సహకరించుకోవడానికి నిర్ణయించినట్లు పేర్కొంది. జీ7 సదస్సుకు అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని, అంతకుముందే తాను భారత్‌లో పర్యటించగలననే ఆశాభావాన్ని జాన్సన్ వ్యక్తం చేశారని తెలిపింది.